మోర్తాడ్, జూలై 5: రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తక్షణమే కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్లు ఆన్‌చేసి కాళేశ్వరం జలాలను ఎత్తిపోసి రిజర్వాయర్లు నింపి రైతులకు సాగునీరు ఇవ్వాలని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉన్న రాజకీయ కోపంతో, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిరుపయోగంగా మార్చి తెలంగాణ రైతాంగం కడుపు కొట్టొద్దని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హితవు పలికారు. ఆదివారం మోర్తాడ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేముల మాట్లాడారు.
తక్షణమే కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద మోటర్లు స్టార్ట్ చేసి అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. అక్కడి నుంచి వరదకాలువ ద్వారా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్లుగా రివర్స్‌పంపింగ్ విధానంతో పోచంపాడ్ ప్రాజెక్ట్‌ను నింపి, చెరువులు, కుంటలు, అలుగులు పారించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. రాజకీయాలు పక్కనపెట్టి రైతుల సంక్షేమం గురించి ఆలోచించాలని రేవంత్‌రెడ్డికి హితవు పలికారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో కేవలం 15టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉన్నదని, ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి కేవలం 1,100క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే వస్తున్నదని చెప్పారు. ఎస్సారెస్పీ, కాకతీయ కాలువ, వరద కాలువ, ప్యాకేజీ 21, గుత్ప, అలీసాగర్, చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతలపై ఆధారపడిన నిజామాబాద్, ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, బోధన్ నియోజకవర్గ రైతులు సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఎగువన గోదావరిలో నీరు లేకున్నా ప్రాణహిత నది ద్వారా ప్రస్తుతం లక్ష క్యూసెక్కుల నీళ్లు మేడిగడ్డ వద్దకు చేరుకుని వృథాగా కిందకు(ఆంధ్రాకు) వెళ్లిపోతున్నాయని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వృథాగా పోయే జలాలను ఒడిసిపట్టి తెలంగాణ పొలాలను తడపాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను డిజైన్ చేశారని గుర్తు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద కేవలం రెండు పిల్లర్లు మాత్రమే కుంగితే ప్రాజెక్ట్ మొత్తం పనికిరాకుండా పోయిందనే భ్రమలు కల్పిస్తూ రెండున్నరేండ్లుగా రేవంత్‌రెడ్డి ప్రాజెక్ట్‌ను పడావు పెట్టారని మండిపడ్డారు.
డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ కింద ఎల్అండ్టీ సంస్థ దాదాపు రూ.400కోట్ల సొంత ఖర్చుతో ఉచితంగా మరమ్మతులు చేయడానికి ముందుకొచ్చినా.. కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతించకపోవడం వారి కక్షసాధింపు చర్యలకు నిదర్శనమన్నారు. రూ.94వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో రూ.4వేల కోట్ల విలువైన మేడిగడ్డ బ్యారేజీలో కేవలం రూ.400కోట్ల విలువైన రెండు పిల్లర్లు మాత్రమే కుంగాయని వెల్లడించారు. కేవ లం రెండుపిల్లర్ల సాకు చూపి మొత్తం బృహత్తర ప్రాజెక్ట్‌ను నిరుపయోగంగా మార్చడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. మేడిగడ్డ బ్యారేజీతో ఎలాంటి సంబంధం లేకుండానే నీటిని ఎత్తిపోసే అద్భుతమైన ఇంజినీరింగ్ వ్యవస్థను కేసీఆర్ అప్పుడే సిద్దం చేసి ఉంచారని ప్రశాంత్‌రెడ్డి గుర్తు చేశారు. మేడిగడ్డ బ్యారేజీకి 4కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్లను ఆన్‌చేస్తే చాలని, అక్కడ సిద్ధంగా ఉన్న పంప్‌హౌస్ బటన్ నొక్కితే కాళేశ్వరం నీరు నేరుగా అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లికి చేరుతుందన్నారు.
ఎల్లంపల్లి ద్వారా వరదకాలువలోకి నీళ్లుపోసి రివర్స్పంపిగ్ ద్వారా ఎస్సారెస్పీ నింపాలన్నా రు. మళ్లీ ఎస్పారెస్పీ నుంచి కాకతీయ, సరస్వతీ కాలువల ద్వారా నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలకు సాగునీటిని అందించవచ్చని చెప్పారు. వరదకాలువ ద్వారా నీటిని రివర్స్‌పంపింగ్ చేయడంతో బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని కమ్మర్పల్లి, మోర్తాడ్, బాల్కొండ మండలాల్లో, ఎస్సారెస్పీ కాకతీయ కాలువ ద్వారా మెండోరా, ఏర్గట్ల మండలాలు, కాళేశ్వరంలో భాగమైన ప్యాకేజీ-21 ద్వారా మోర్తాడ్, భీమ్‌గల్, వేల్పూర్ మండలాల్లోని సుమారు 70శాతం గ్రామాలకు సాగునీటిని అందించవచ్చని ఎమ్మెల్యే వివరించారు. ఎస్సారెస్పీ నుంచి గుత్ప, అలీసాగర్ ప్రాజెక్టుల కింద ఉన్న నిజామాబాద్ జిల్లాలోని అనేక గ్రామాలకు సాగునీటిని అందించవచ్చని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.
రేవంత్‌రెడ్డి దేవుండ్ల మీద ఒట్టుపెట్టి మాట తప్పినందుకే రాష్ట్రంలో వర్షాలు కురవడం లేదని అన్నారు. కాళేశ్వరంలో భాగంగా కేసీఆర్ ఇదివరకే కట్టి ఉంచిన కన్నెపల్లిపంప్హౌస్తోపాటు అన్నారం, సుందిళ, ఎల్లపంలి పంప్‌హౌస్, మూడు కాళేశ్వరం రివర్స్‌పంపింగ్ మోటర్లు, ప్యాకేసీ 21 మోటర్లు ఆన్‌చేసి రైతులకు సాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులందరినీ కలుపుకుని కన్నెపల్లి పంప్‌హౌస్, కాళేశ్వరం రివర్స్ పంపింగ్ మోటర్ల బటన్లను తామే స్వయంగా నొక్కి నీటిని విడుదల చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలపై రైతులు జాగృతమై పోరాటంలో బీఆర్ఎస్తో కలిసిరావాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. సమావేశంలో శేఖర్‌రెడ్డి, కల్లెడ ఏలియా, నాగధర్‌రెడ్డి, బద్దం ప్రవీణ్‌రెడ్డి, రాజాపూర్ణానందం, బద్దం రవి, బద్దంఅశోక్, ఆర్మూర్ మహేశ్, ఏలేటి రమేశ్, బోగ ఆనంద్, పర్స దేవన్న, పాపాయి పవన్, గోపిడి సత్యనారాయణ, ఏనుగు రాజేశ్వర్, నవీన్, ఇంతియాజ్, యూసుఫ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.