మోర్తాడ్, ఏప్రిల్ 18: కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ. లక్ష చెక్కుతో పాటు తులం బంగారం ఇవ్వాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన శనివారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు తీసుకున్న లబ్ధిదారులందరికీ, అలాగే కొత్తగా మంజూరు కాబోయే లబ్ధిదారులకు సైతం చెక్కుతో పాటు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు సంబంధించి నియోజకవర్గంలోని 127 ఫైల్స్‌పై ఎమ్మెల్యే సంతకాలు చేశారు. ఫైల్స్‌ను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే అవసరమైన సంతకాలు పూర్తి చేసి ప్రభుత్వానికి పంపించాలని ఈసందర్భంగా తహసీల్దార్లకు సూచించారు.