వేల్పూర్ , ఏప్రిల్ 24: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. వేల్పూర్ మండల కేంద్రంలో పహల్గాంలో ఉగ్రవాదుల కాల్పు ల్లో మరణించిన వారికి గురువారం ఆయన నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకురాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. పహల్గాంలో యాత్రికులపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులతోపాటు ప్రోత్సహించిన సంస్థలపై శత్రుదేశాలకు భారత్ దీటైనా సమాధానం చెప్పాలన్నారు. పహల్గాం ఘటనను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని తెలిపారు. భారత్‌ను ఎదుర్కొనే దమ్ములేక శత్రుదేశాలు పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంటలిజెన్స్ వైఫల్యం వల్లే ముష్కరులు ఈ చర్యలకు పాల్పడే సాహసం చేశారని అన్నారు.
మళ్లీ ఇలాంటి దాడులు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేయడంతోపాటు ఇంటలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేయడంపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదన్నారు. భారత సైన్యం, ప్రజల్లో ఆత్మసైర్యం దెబ్బ తినకుండా దాడులు చేసిన ముష్కరులపై చెంపపెట్టు లాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రేగుల్ల రాములు, పిట్ల సత్యం, బాల్కొండ, భీమ్‌గల్, వేల్పూర్, కమ్మర్పల్లి బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్లు ప్రవీణ్‌రెడ్డి, దొన్కంటి నర్సయ్యం, నాగధర్, దేవేందర్, దోళ్ల రాజేశ్వర్‌రెడ్డి, నడ్కుడ గంగారెడ్డి , మొండి అశోక్ తదితరులు పాల్గొన్నారు.