కామారెడ్డి, ఏప్రిల్ 25 : బీఆర్ఎస్ ప్రజల కోసం ఏర్పాటు చేసిన పార్టీ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేసీఆర్‌ను ఆశీర్వదించాలని కోరారు. శుక్రవారం ఆయన కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ మాజీ విప్ గంప గోవర్ధన్ నివాసంలో మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, జాజాల సురేందర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు.
బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఏడాదిపాటు నిర్వహించాలని కేసీఆర్ పిలుపునిచ్చారని తెలిపారు. వరంగల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభ తెలంగాణ ప్రజల కోసమే అని పేర్కొన్నారు. 15 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసి ఒక్కడుగా బయల్దేరి, దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి, తెలంగాణను సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. బిందెడు తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకునే దుర్భర పరిస్థితి నుంచి, ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా శుద్ధ జలాలను అందించిన నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. రాష్ర్టాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసి, దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టారని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. అన్ని వర్గాల వారిని సీఎం రేవంత్‌రెడ్డి వంచించారని అన్నారు. ఘోరంగా మోసపోయామనే భావన ప్రజల్లో ఉందన్నారు. ప్రజలు రేవంత్ రెడ్డి వద్దు.. కేసీఆర్ ముద్దు అని అంటున్నారని తెలిపారు. కేసీఆర్ మళ్లీ ఎప్పుడు వస్తాడో అని ఎదురుచూస్తున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు అనేక హామీలు ఇచ్చారని, వాటిని అమలుచేయాలని వరంగల్ సభా వేదిక నుంచి ప్రజల పక్షాన డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు.