ఎల్లారెడ్డి రూరల్ (నాగిరెడ్డిపేట), మే 9: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అనర్హులను ఎంపిక చేశారని నాగిరెడ్డిపేట మండలంలోని వదల్పర్తిలో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అర్హులని కాదని, కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని ఎంపిక చేశారని పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం ఆందోళన చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తమకు అనుకూలంగా ఉన్నవారిని ఎంపికచేశారని ఆరోపించారు.
విచారణ చేపట్టి అర్హులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొదటి విడుతలో అర్హులైన వారికి ఎంపిక చే యాలని సూచిస్తుంటే గ్రామాల్లో మాత్రం ఇష్టానుసారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపికైన వారిలో అందరూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నవారే అని తెలిపారు. గ్రామస్తులు ఆందోళన చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న నాగిరెడ్డిపేట ఎస్సై మల్లారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వారిని సముదాయించారు.అధికారులకు ఫిర్యా దు చేస్తే విచారణ చేపట్టి అనర్హులను తొలగిస్తారని సూచించండంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.