నిజామాబాద్, ఆగస్టు 22, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కర్షకులకు యూరియా కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. వానాకాలం సీజన్లో పంటల సాగును పండుగలా సాగిద్దామనుకున్న వారికి తీవ్ర నిరాశే ఎదురవుతోంది. పంట కాలానికి సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో చేతికి తగినతం యూరియా సంచులు అందకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వానాకాలం సీజన్ ప్రారంభం నుంచి అనేక చోట్ల కొరత వేధించింది. నెలన్నర రోజులుగా ఈ సమస్య కొనసాగుతున్నప్పటికీ అధికార పార్టీ నేతలెవ్వరూ పట్టించుకోవడం లేదు. నిజామాబాద్‌లో ప్రస్తుతానికి యూరియా సమస్య వెలుగు చూడకపోగా కామారెడ్డిలో తాజాగా బీబీపేటలో బారులు తీరిన రైతులు దుస్థితి యూరియా అవసరాన్ని తేటతెల్లం చేస్తోంది. సమయానుకూలంగా యూరియా సైప్లె చేయకపోవడంతో తీవ్రమైన కొరత ఏర్పడి ఒకేసారి రైతులంతా ఎరువుల కోసం పాట్లు పడాల్సిన వస్తోంది. కేసీఆర్ హయాంలో యూరియా ఇబ్బందులు అన్నవే కనిపించలేదు. సాగుకు ముందే స్టాక్ అందుబాటులో ఉండేది. దీనికి అదనంగా బఫర్ స్టాక్ సైతం రైతుల అవసరాలను తీర్చేందుకు పెట్టుకునేది. కానిప్పుడు ప్రభుత్వానికి వ్యూహం లేకుండా పోయింది. రైతుల అవసరాలకు తగ్గట్లుగా యూరియాను సమయానుకూలంగా అందివ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందడంతో అన్నదాతలు తీవ్రంగా మండిపడుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో వానాకాలం 2025 సీజన్‌కు వ్యవసాయ శాఖ అంచనాల మేరకు 75వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది. డీఏపీ 13072 మెట్రిక్ టన్నులు, పొటాష్ 13,105 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 44,480 మెట్రిక్ టన్నులు మేర వినియోగం అవుతుందని వ్యవసాయ శాఖ గుర్తించింది. ఇప్పటి వరకు 62వేల 254 మెట్రిక్ టన్నులు యూరి యా సరఫరా అయినట్లుగా వ్యవసాయ శాఖ చెబుతోంది. డీఏపీ 11,485 మెట్రిక్ టన్నులు, పొటాష్ 2590 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 53,482 మెట్రిక్ టన్నులు సరఫరా చేశారు. కామారెడ్డి జిల్లాలో యూరియా 50వేల మెట్రిక్ టన్నులు, డీఏపీ 18,220 మెట్రిక్ టన్నులు, పొటాష్ 16,926 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 45వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుందని వ్యవసాయ శాఖ గుర్తించింది. ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 88.69 శాతం మేర యూరియా సరఫరా చేసినట్లుగా వ్యవసాయ శాఖ చెబుతోంది. గతేడాది 48,904 మెట్రిక్ టన్నులు యూరియా కామారెడ్డి జిల్లాలో వినియోగించారు. వానాకాలం కావడంతో మరింత ఎక్కువే వాడకం ఉండనుంది. ప్రస్తుతానికి 40వేల 532 మెట్రిక్ టన్ను లు యూరియా వినియోగమైంది. ఇందులో పీఏసీఎస్‌ల ద్వారా 25వేల 819 మెట్రిక్ టన్ను లు, ప్రైవేటు దుకాణాల ద్వారా 14,712 మెట్రిక్ టన్నులు మేర యూరియాను రైతులకు అందించారు.
యూరియా సరఫరా నిరాటంకంగా జరుగుతోందని వ్యవసాయ శాఖ చెబుతోంది. క్షేత్ర స్థాయిలో యూరియా కోసం ఎదురు చూస్తున్న వారు అనేకులు ఉన్నారు. ఓ వైపు పొలం పనుల్లో బిజీగా ఉంటూనే పీఏసీఎస్‌ల వద్ద బారులు తీరి విలువైన సమయాన్ని రైతులు కోల్పోతున్నారు. పొలం పనుల్లో వ్యవసాయ కూలీలను పెట్టుకుని ఎరువుల కోసం పడరాని పాట్లు పడాల్సిన దుస్థితి రైతులకు ఏర్పడింది. ఇందుకు బీబీపేటలో రెండు రోజులుగా ఎదురవుతోన్న ఘటనలే తార్కారణంగా నిలుస్తున్నాయి. బీబీపేట మండలంలో స్టాక్ అందుబాటులో లేకపోవడంతో రైతులు ప్రైవేటు ఎరువుల దుకాణాల వద్ద చెప్పులు అరిగేలా తిరిగారు. స్టాక్ వచ్చిందనే సమాచారం తెలుసుకుని షాపుల వద్ద క్యూ కట్టిన దుస్థితి బుధవారం రోజున వెలుగు చూసింది. వచ్చిన స్టాక్‌ను శుక్రవారం పంపిణీకి సిద్ధం చేయగా బీబీపేటలో రైతులు భారీ వరుసలతో లైన్లో నిలబడాల్సి వచ్చింది. సమయానికి యూరియా సరఫరా జరిగి ఉంటే భారీ క్యూ లైన్లు ఎందుకు ఉంటాయని? రైతులు ప్రశ్నిస్తున్నారు. అవసరానికి తగ్గట్లుగా, సమయానికి యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. యూరియా కొరత లేదంటూ రాష్ట్ర మంత్రులు, వ్యవసాయ శాఖ అధికారగణమంతా కొండంత రాగాలు తీస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో రైతులు బారులు తీరుతోన్న ఘటనలపై నోరు మెదపడం లేదు.