గాంధారి/ఆర్మూర్‌టౌన్, జూలై 1: యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. గాంధారి మండల కేంద్రంలో ధర్నా నిర్వహించగా.. ఆర్మూర్ సహకార సంఘం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. మంగళవారం గాంధారి సొసైటీ వద్దకు యూరియా కోసం రైతులు తరలివచ్చారు. కొందరికి మాత్రమే యూరియా బస్తాలు అందాయి. దీంతో ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తమకు సరిపడా యూరియా అందజేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ సంఘ్ నాయకులతో కలిసి సింగిల్‌విండో కార్యాలయం ఎదురుగా బాన్సువాడ-కామారెడ్డి రహదారిపై ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వానకాలంలో సాగు చేస్తున్న పంటకు ప్రస్తుతం యూరియా ఎంతో అవసరం ఉంటుందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని సరిపడా యూరియాను తెప్పించాలని అధికారులను డిమాండ్ చేశారు. యూరియా కొరతపై సొసైటీ సిబ్బందిని వివరణ కోరగా.. పట్టా పాస్‌పుస్తకం ఉన్న ప్రతి రైతుకు ఐదు బస్తాల యూరియా అందజేస్తున్నట్లు తెలిపారు. రైతుల కోసం అదనంగా మరో రెండు లారీల యూరియాను తెప్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
యూరియా కోసం ఆర్మూర్ ప్రాథమిక సహకార సంఘం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. వర్షాకాలం ప్రారంభమైనా సొసైటీలకు యూరియా రాకపోవడం ఏమిటని సిబ్బందిని ప్రశ్నించారు. రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలన్నారు. యూరియా అవసరమని తెలిసినా అధికారులు నిర్లక్ష్యం వహించడం సబబుకాదన్నారు. రైతులందరికీ సరిపడా యూరియా అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఇప్పటికైనా సొసైటీలో యూరియా అందుబాటులో ఉంచాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు