భిక్కనూరు, సెప్టెంబర్ 15: ఉమ్మడి జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తున్న విషయం తెలిసిందే. బస్తా యూరియా కోసం రైతులు గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు. ప్రస్తుతం బస్తా యూరియా దొరకడమే గగనంగా మారిగా…మండలంలోని రామేశ్వర్‌పల్లి గ్రామంలో యూరియా బస్తాను చోరీ చేసిన ఘటన చోటుచేసుకున్నది.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..రామేశ్వర్‌పల్లి గ్రామానికి చెందిన రైతు తక్కల్ల గంగారెడ్డికి కొన్నిరోజులుగా యూరియా లభించకపోవడంతో తనకు తెలిసిన ఓ రైతు నుంచి చేబదులుగా యూరియా బస్తా తీసుకొని మక్కజొన్న పంటపై చల్లడానికి తీసుకెళ్లాడు. తన వ్యవసాయక్షేత్రంలోని బావి వద్ద యూరియా బస్తా ఉంచి ఏదో పనిమీద ఇంటికి వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి బావి వద్ద యూరియ బస్తా కనిపించకపోవడంతో తన తోటి రైతులు, మిత్రుల దృష్టికి తీసుకెళ్లాడు.
ఇద్దరు యువకులు మక్కజొన్న కంకుల మధ్యలో యూరియా బస్తాను బైక్‌పై తీసుకెళ్లినట్లు స్థానికులు చెప్పడంతో సదరు రైతు వెంటనే టోల్‌ప్లాజా వద్దకు చేరుకొని సిబ్బందికి విషయం చెప్పాడు. అక్కడి సిబ్బంది సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా ఓ బైక్‌పై ఇద్దరు యువకులు మక్కజొన్న చొప్ప మధ్య యూరియా బస్తా తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. రికార్డయిన ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న సదరు యువకులు తనకు యూరియా బస్తా ఇచ్చి క్షమాపణ కోరినట్లు రైతు గంగారెడ్డి తెలిపాడు.