ఖలీల్వాడి, నవంబర్ 6 : సమైక్యపాలనలో నగరం అభివృద్ధికి ఆమడదూరంలో ఉందని, స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలో నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా అన్నారు. జిల్లాకేంద్రంలోని 24వ డివిజన్ (గాయత్రీనగర్)లో నాయకులు, కార్యకర్తలతో కలిసి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నగరంలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధితోపాటు సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ తిరుగుతూ, కరపత్రాలు పంచుతూ వివరించారు. గాయత్రీనగర్కు చేరుకున్న బిగాలకు డివిజన్లోని మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ..
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన అనంతరం ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టి నగరాన్ని సుందరంగా మార్చామని అన్నారు. అన్ని డివిజన్లలోని కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందజేస్తున్నామన్నారు. ఆధునిక హంగులతో వైకుంఠధామాల నిర్మాణం చేపట్టామని, సబ్బండవర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని కోరారు. కారు గుర్తుకే ఓటు వేసి, తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ప్రచారంలో మేయర్ దండు నీతూకిరణ్, మాజీ కార్పొరేటర్ ఎనుగందుల మురళి, గుజ్జేటి వెంకటనర్సయ్య, ఎస్ఆర్.సత్యపాల్, ధర్మపురి, కస్తూరి గంగరాజు పాల్గొన్నారు.