అకాల వర్షాలతో రైతులు విలవిల్లాడుతున్నారు. కళ్ల ముందే వడ్లు వరదలో కొట్టుకుపోతుండడం చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ, కొట్టుకుపోయిన వడ్లను దోసిళ్లతో ఏరుకున్నారు. సోమవారం ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కనిపించిన దృశ్యాలివి.. నాగిరెడ్డిపేట, లింగంపేట్, మోర్తాడ్, కమ్మర్పల్లి, సిరికొండ, పొతంగల్ తదితర మండలాల్లో సోమవారం కురిసిన భారీ వర్షం రైతులను నిండా ముంచింది.
కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దవగా, కోతకు సిద్ధంగా ఉన్న వరి పైర్లు నేలవాలాయి. ఒక్కసారిగా వచ్చిన వానతో ధాన్యాన్ని కాపాడుకోలేక రైతాంగం చేష్టలూడిగి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. చూస్తుండగానే వర్షం దంచికొట్టడం, వరద ఏరులై ధాన్యం కుప్పలను ముంచెత్తడం, ఆ ఉధృతికి వడ్లు కొట్టుకు పోతుంటే వాటిని ఆపలేక, పంటను కాపాడుకోలేక రైతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఉప్పొంగుతున్న కన్నీళ్లను దిగమింగుకుంటూ జోరు వానలోనూ వడ్లను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడ్డారు.
-నాగిరెడ్డిపేట/లింగంపేట్/మోర్తాడ్/పొతంగల్, అక్టోబర్ 21
నాగిరెడ్డిపేట మండలంలో సోమవారం గంటకు పైగా కురిసిన భారీ వర్షం రైతున్నలను గుండెకోతకు గురిచేసింది. గోపాల్పేట, పోచారం, మాల్తుమ్మెద, బంజారా లింగంపల్లి, తాండూర్, వెంకంపల్లి గ్రామాల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసి, నీట మునిగింది. వర్షపు నీటితో కొట్టుకుపోయిన ధాన్యం కుంటల్లోకి చేరింది. చేతికొచ్చిన పంట కళ్లముందే కొట్టుకుపోతుండడంతో రైతులు అచేతనులై చూస్తుండి పోయారు. అటు లింగంపేట్ మండలంలోనూ జోరువాన కురిసింది. భవానీపేట, ముంబాజీపేట, కొండాపూర్, జల్దిపల్లి, ముస్తాపూర్, ఎల్లారం తదితర గ్రామాల్లో కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఉన్నట్టుండి వర్షం రావడంతో రైతులు ధాన్యాన్ని తడవకుండా కాపాడుకోలేక పోయారు. అటు మోర్తాడ్, కమ్మర్పల్లి, సిరికొండ, పొతంగల్ తదితర మండలాల్లో కురిసిన వానతో వడ్లు తడిసి పోయాయి. చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి.
సుమారు నెల క్రితమే వరి కోతలు ప్రారంభం కాగా, 15 రోజుల నుంచి ఊపందుకున్నాయి. బోధన్, బాన్సువాడ డివిజన్లలో సగానికి పైగా కోతలు పూర్తి కావొచ్చాయి. లింగంపేట్, నాగిరెడ్డిపేట్ తదితర మండలాల్లో ఎక్కడ చూసినా ధాన్యపు రాసులే కనిపిస్తున్నాయి. అయితే, కొనుగోళ్లు ప్రా రంభం కాకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. వడ్ల కొనుగోళ్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లలో పూర్తిగా విఫలం కావడం, అదే సమయంలో అకాల వర్షాలు వెంటాడుతుండడంతో రైతుల కష్టాలు రెట్టింపయ్యాయి. కొనుగోలు కేంద్రాలను జోరుగా ప్రారంభిస్తున్నా ఎక్కడా కాంటాలు వేసింది లేదు.
ఒక్క గింజా కొన్నది లేదు. ఇదేమిటని రైతులు ప్రశ్నిస్తే అధికారుల నుంచి సమాధానం కరువైంది. అయితే, మిల్లర్లు ధాన్యం తీసుకోవడానికి ముందుకు రావడం లేదని తెలిసింది. కాంటాలు వేయక పోవడంతో ఎక్కడికక్కడ వడ్ల కుప్పలు పేరుకుపోయాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ధాన్యం కుప్పలు నీట మునిగాయి. వడ్లు తడిసి రంగు మారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కాంటాలు వేస్తే తమకీ కష్టాలు ఉండక పోయేవన్నారు. కేసీఆర్ సారు ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వడ్లు అమ్ముకున్నామని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వం వెంటనే వడ్ల కాంటాలు ప్రారంభించాలని, రంగు మారిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.