భీమ్గల్/సిరికొండ/వర్ని/చందూర్, మార్చి20: అకాల వర్షాలు అన్నదాతలను ఆగం జేస్తున్నాయి. గురు,శుక్రవారాల్లో కురిసిన వానలు తీవ్ర నష్టం మిగిల్చాయి. భీమ్గల్ మండలంలోని బాచన్పల్లి, పిప్రి గ్రామాలలో వడగండ్ల వాన కురిసింది. దీంతో వరిపైరు నేలవాలగా, గింజలు రాలిపోయాయి. ఒక్క బాచన్పల్లిలోనే వంద ఎకరాల్లో నష్టం వాటిళ్లినట్లు రైతులు వాపోతున్నారు.
వర్ని మండలంలోని సిద్దాపూర్లో జొన్న పంట మొత్తం నేలకొరిగింది. ఇక్కడ దాదాపు 50 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు రైతులు చెబుతున్నారు. చందూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో కురిసిన వడగండ్ల వానతో పంటలు దెబ్బ తిన్నాయి. సిరికొండ మండలం రావుట్లలో ధాన్యం నేలరాలింది. చేతికొచ్చిన పంటలు కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.