Police Commissioner Sai Chaitanya | వినాయక నగర్, జూన్ 28: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా కేంద్ర బలగాల సమన్వయంతో ఆక్టోపస్, గ్రేహౌండ్స్, స్నైపర్ టీమ్స్,లతో భారీ బందోబస్తు తో పాటు పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. కేంద్రమంత్రి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆదివారం వస్తున్న సందర్భంగా ఆయన కు పూర్తి స్థాయిలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర బలగాలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రంలోని ప్రత్యేక బలగాలైన 2 ఆక్టోపస్ టీమ్ లు, గ్రేహౌండ్స్ టీమ్లు, స్నైపర్ టీమ్స్ ల తో పాటు, నిజామాబాద్ జిల్లాలోని స్పెషల్ పార్టీ టీమ్స్, బీడీ టీమ్స్, డాగ్ స్వ్కాడ్స్ లతో బస్టాండ్స్, రైల్వే స్టేషన్స్ కల్వర్టులు రోడ్లు మొదలగు ప్రదేశాలలో చెక్ చేసి ఏరియా డామినేషన్ చేయడం జరిగిందని పేర్కొన్నారు.
దీంతో పాటు గత వారం రోజుల నుండి అన్ని హోటల్స్, రెస్టారెంటులు, తనిఖీలు నిర్వహించడంతోపాటు ఆయన పర్యటించే ప్రాతంలోని అన్ని చోట్ల ఇండ్లను సైతం తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు. అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ 10 కి.మీ వరకు పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోనికి తీసుకున్నట్లు తెలిపారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ,చుట్టు పక్కల ప్రతీ ఇంట్లో ఎవ్వరిని కొత్తవారిని రానివ్వవద్దని, సదరు ఇండ్ల యజమానులకు సూచించినట్లు సీపీ వెల్లడించారు.
అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనపడితే వెంటనే డయల్ 100 లేదా మీ స్థానిక పోలీసులకు సమాచారం అందించగలరని పేర్కొన్నారు. కేంద్రమంత్రి పర్యటన సందర్భంగా అదిలాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్, మెదక్, సిద్దిపేట్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన పోలీస్ సిబ్బంది తో పాటు టీఎస్ఎస్పీ బెటాలియన్ పోలీస్ సిబ్బంది మొత్తం 1300 మంది బలగాలతో బందోబస్తు నిర్వహణ చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రం హోం శాఖ మంత్రి పర్యటన సందర్భంగా ప్రారంభం నుండి చివరి వరకు దారి పోడువునా సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు బైనాక్యూలర్లతో పర్యవేక్షణ నిర్వహిస్తున్నట్లు సీపీ వెల్లడించారు. పాత నేరస్తులపై నిఘా పటిష్ట పర్చడం జరిగిందని, ఈ సందర్భంగా ప్రజలందరూ ట్రాఫిక్ సిబ్బందికి బందోబస్తులో ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి సహకరించాలని సీపీ సూచించారు.