కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా ఇందూరు నగర పర్యటన నిరాశపర్చింది. పసుపు సాగుచేసే రైతులపై వరాల జల్లు కురిపిస్తాడని ఆశించిన రైతులకు భంగపాటే ఎదురైంది. 2019 ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా అర్వింద్ ఇచ్చిన హామీని అటకెక్కించారు. హోంమంత్రి నోట నుంచి ఎంఎస్పీపై కీలక ప్రకటన వస్తుందని భావించిన రైతులంతా కంగు తినాల్సి వచ్చింది. కేవలం పసుపు ఉత్పత్తి, పసుపు ఆధారిత పరిశ్రమ విస్తరణపైనే మాట్లాడగా.. పసుపునకు కనీస మద్దతు ధరపై నోరు మెదపకపోవడం గమనార్హం. పసుపు బోర్డుతో భవిష్యత్తులో ప్రతి రైతుకు లాభం జరుగుతుందని చెప్పినా, రైతుల సాగు కష్టాలను పట్టించుకోకపోవడంపై కర్షకులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.
-నిజామాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / వినాయక్‌నగర్, కంఠేశ్వర్
నిజామాబాద్ నగరంలోని వినాయక్‌నగర్‌లో రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సం జయ్, ఎంపీలు ఈటల, అర్వింద్, లక్ష్మణ్‌తో కలిసి అమిత్ షా ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమా నికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు తుమ్మల, సీతక్క హాజరయ్యారు.
అనంతరం డీఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో కిసాన్ సమ్మేళన్ సభలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు. పసుపు మద్దతు ధరపై దాటవేత ధోరణిని ప్రదర్శించడంతో రైతుల్లో నిరుత్సాహం అలుముకున్నట్లయ్యింది. పసుపు రైతులకు ఎకరాకు రూ.లక్షన్నర పెట్టుబడి ఖర్చు అవుతుంది. పంటను అమ్ముకుంటే సరైన ధర రాక ఏటా ఇబ్బంది పడుతున్నారు. ఈ సీజన్లోనూ గరిష్ఠంగా రూ. 12వేలు దక్కించుకోలేదు. రూ.15వేలు ఎంఎస్పీ నిర్ణయిస్తేనే రైతులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అవినీతి పెరిగి పోయిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చేసిందని మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. ఉగ్రవాదాన్ని మాత్రమే కాకుండా దేశంలో నక్సలిజాన్ని 2026, మార్చి నెలాఖరులోగా అంతం చేస్తామమని స్పష్టం చేశారు. నక్సలైట్లు తక్షణమే హత్యాకాండాను ఆపేసి లొంగిపోవాలని, జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని సూచించారు. నక్సలైట్లతో ఎలాంటి చర్చలు ఉండబోవని తేల్చిచెప్పారు.
నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుతో ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడి రైతులు పండించిన పసుపునకు గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. పసుపు ఉత్పత్తిలో దేశంలోనే జిల్లా ముందున్నదని తెలిపారు. ప్యాకేజీ, మార్కెటింగ్, ఎగుమతిలో పూర్తి స్థాయిలో వ్యవస్థ ఏర్పాటు అవుతుందన్నారు. అమెరికా, యూరప్, యూ కే, వియత్నాం, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్‌కు పసుపు ఉత్పత్తులు ఎగుమతి చేస్తామన్నారు. 2030 నాటికి బిలియన్ డాలర్ల పసుపు ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవాన్ని ఆరు నెలల క్రితమే కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. అదే పసుపు బో ర్డును తాత్కాలిక కార్యాలయం పేరుతో ప్రధాని తర్వాత అత్యధిక ప్రొటోకాల్ కలిగిన కేంద్ర హోంమంత్రితో రిబ్బన్ కట్ చేయించడం హాస్యాస్పదంగా మారింది.
వినాయక్ నగర్, జూన్: 29: పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించిన కిసాన్ సమ్మేళన్ సభకు తక్కువ సంఖ్యలో జనం తరలివచ్చారు. అమిత్‌షా ప్రసం గం మొదలు నుంచి ముగిసేవరకు సభా ప్రాంగ ణం వెనుక భాగంగా జనం లేక ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. కొందరు అమిత్‌షా ప్రసంగిస్తుండగానే మధ్యలో నుంచి లేచి వెళ్లిపోయారు. దీంతో కుర్చీలు ఖాళీ కావడంతో దీనిని అక్కడే ఉన్న ఫొటో జర్నలిస్టు ఫొటోలు తీయసాగాడు. దీనిని గమనించిన అక్కడే ఉన్న కొందరు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఫొటోలు ఎందుకు తీస్తున్నావంటూ దాడికి యత్నించారు. విధి నిర్వహణలో ఉన్న ఒక ఫొటో జర్నలిస్టుపైకి దాడికి యత్నించడంపై పలువురు మండిపడ్డారు.