బాల్కొండ, జూన్ 4: బాల్కొండ మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెల్లవారుజామున 2.30గంటలకు కారులో వచ్చిన గుర్తుతెలియని దుండగులు ఎస్బీఐ ఏటీఎం ఎంట్రెన్స్‌లో ఉన్న సీసీ కెమెరాలకు నల్లని రంగును స్ప్రే చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి గ్యాస్ కట్టర్‌తో వచ్చి ఏటీఎం మిషన్‌ను కట్ చేశారు. అదే సమయంలో ముంబైలో ఉన్న అధికారులకు అలర్ట్ మెస్సేజ్ వెళ్లగా అది చూసి స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. డయల్ 100కు సమాచారం అందించగా పోలీసులు వచ్చేలోపే ఏటీఎంలో ఉన్న రూ.24,92,600లను అపహరించుకొని పరారయ్యారు. విషయం తెలుసుకున్న ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి, రూరల్ సీఐ శ్రీధర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి వివరాలను సేకరించారు. చుట్టు పక్కల ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఏటీఎం ఛానల్ మేనేజర్ నితిన్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఏఎస్సై శంకర్ తెలిపారు.