నిజామాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు నోటికి వచ్చినట్లు వాగ్దానాలు ఇచ్చింది. రైతులు, కార్మికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు.. ఇలా అందరినీ సంతృప్తి పరిచే విధంగా మ్యానిఫెస్టోను ప్రకటించింది. అధికారం చేపట్టిన ఏడాదిలోపే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పింది. అధికారంలోకి వచ్చి 18నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయలేదు. అప్పట్లో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లనే ఇప్పుడు భర్తీ చేస్తున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉండడం.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తుండడంతో నిరుద్యోగుల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు పెల్లుబిక్కుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలోని పలు శాఖల్లో ఇప్పటికే వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకూ నియామక ప్రక్రియ ఇంకా మొదలవ్వలేదు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వానికి స్పష్టత లేక పోవడంతో నిరుద్యోగులు నిరాశతో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2024 చివరి నాటికి 9వేల మంది ఉద్యోగ విరమణ చేయగా.. 2025 ఆర్థిక సంవత్సరం చివరికి మరో 9వేల మంది రిటైర్డ్ అయ్యారు.
ఉమ్మడి జిల్లాలో ఈ సంఖ్య దాదాపుగా రెండు వేల మంది వరకు ఉండొచ్చని ఉద్యోగ సంఘాల నేతలు అంచనా వేస్తున్నారు. ఇవన్నీ భర్తీ చేయాల్సిన పోస్టులే అయినా.. నియామక ప్రక్రియ మాత్రం ప్రారంభం కాలేదు. ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల ఖాళీలతో కూడిన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి సెప్టెంబర్ 17 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని ప్రకటించినా.. ఇప్పటి వరకు ఏ శాఖ నుంచి కూడా స్పష్టమైన వివరాలు వెలువడలేదు. జూన్ 2వ తేదీ ముగిసి నెల రోజులు గడిచినా.. ఒక్క నోటఫికేషన్ కూడా లేదు. సెప్టెంబర్ 17 వస్తుండగా.. ఇంకెప్పుడు ఉద్యోగాల భర్తీ చేపడుతారని నిరుద్యోగ యువత ప్రశ్నిస్తున్నారు.
ప్రతి నిరుద్యోగ యువకుడికీ నెలకు రూ.4వేల నిరుద్యోగ భృతిని అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, ఇప్పటి వరకు ఆ ప్రక్రియను ప్రారంభించ లేదు. ఎవరి ఆధారంతో ఎలా అర్హత నిర్దేశించబడు తుందో స్పష్టత లేదు. సాంకేతికంగా ఎలా అమలు చేస్తారన్నదీ తెలియదు. ఏడు జోన్లలో ఎంప్లాయి మెంట్ ఎక్షేంజీలు ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటి వరకు ఆ ప్రక్రియను ప్రారంభించలేదు. స్కిల్ సెంటర్ల ఏర్పాటు ఆమోద దశలోనే నిలిచింది.
విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు, రూ.10లక్షల వరకు వడ్డీ లేని రుణాల భరోసా ఇవన్నీ కేవలం ఓటు కోసం ఇచ్చిన వాగ్దా నాలే. ప్రతి విద్యార్థికీ రూ.5లక్షల విద్యా భరోసా కార్డు, ఉచిత వైఫై, యూనివర్సిటీల రీసెర్చ్ స్కాలర్స్‌కు నెలకు రూ.10వేల ఫెలోషిప్ వంటి హామీలు కూడా ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాయి. విద్యార్థులకు గెస్ట్ ఫ్యాకల్టీ గౌరవ వేతనం రూ.50వేలకు పెంచుతామని చెప్పిన మాటలు అమల్లోకి రాలేదు. తొలిసారి రుసుము చెల్లించి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పేరు నమోదు చేస్తే, ఆ ఏడాదిలో మిగతా నోటిఫికేషన్లకు ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదన్న హామీ కూడా ఇంకా అమలు కావడం లేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాల ప్రక్రియ అంత వేగంగా సాగడం లేదు.
ఉద్యోగాల భర్తీ విషయంలో రోజుకో కథ చెబుతూ.. కాంగ్రెస్ పాలకులు రోజులు గడుపుతున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రకటన నిరుద్యోగ యువతను తీవ్ర గందరగోళంలోకి నెడుతున్నది. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయొద్దంటూ నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారంటూ ఆయన పదే పదే చెప్పుకుంటుండడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. భర్తీ చేయాల్సిన ఉద్యోగాలను గాలికి వదిలేసి, ఆ విషయాన్ని నిరుద్యోగ యువతపై రుద్దేందుకు సీఎంతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పని పెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. ఆర్థిక శాఖ నుంచి అనుమతులు పొందడంలో ఆలస్యం, క్యాడర్ స్ట్రెంత్ విభజనపై స్పష్టత లేకపోవడం, విభాగాల పునర్వ్యస్థీకరణ జరగకపోవడం వంటి కారణాలతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన బ్యాగ్ లాగ్ పోస్టుల భర్తీపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఈ వర్గాలకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు చేయకపోవడం ఆయా వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీస్తున్నది. ల్యాండ్ అండ్ రికార్డులు, మహిళా శిశు సంక్షేమ శాఖలు ఇప్పటికీ పునర్వ్యవస్థీకరణ జరగక ఆగమాగం అవుతున్నాయి. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలకు మున్సిపల్ ఇంజినీర్ పోస్టులు మంజూరు కాలేదు. నీటి పారుదల శాఖలో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు మంజూరు చేయాల్సి ఉన్నది. విద్యాశాఖలో అన్ని జిల్లాలకూ డీఈవో పోస్టులు ఇప్పటికీ మంజూరు కాలేదు. ఇంటర్మీడియెట్ విద్యాధికారుల పోస్టులే లేవు. కొత్తగా ఏర్పాటైన కాలేజీలకు పోస్టులు మంజూరు చేయలేదు. నోడల్ అధికారులతోనే వ్యవస్థ నడుస్తున్నది.
పారదర్శకంగా ఉండే నిరుద్యోగ భృతి విధానాన్ని రూపొందించి తక్షణం అమలు చేయాలి. 59వేల ఉద్యోగాలు ఇచ్చామంటూ బుకాయింపులు ఇప్పటికైనా మానుకోవాలి. నియామక పత్రాలిస్తే భర్తీ చేసినట్లా..? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు ఫలితాలు మాత్రమే ఇచ్చారు. అధికారంలోకి రాగానే తొలి ఏడాది 2లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎక్కడికి పోయాయి. నిరుద్యోగులను రెచ్చగొట్టిన మేధావులకు ఉద్యోగాలు వచ్చాయి. జాబ్ క్యాలెండర్ ప్రకారం 13 నోటిఫికేషన్లు విడుదల చేయాలి.
– తాజుద్దీన్, బీఆర్ఎస్ యువజన నాయకుడు
ఒక వైపు ఉద్యోగ ఖాళీలు పెరుగుతుంటే, మరోవైపు నియామకాలు జరగకపోవడమే కాకుండా కింది స్థాయి ఉద్యోగులకు కూడా ప్రమేషన్ రావడం లేదు. దీంతో ఉద్యోగ వ్యవస్థ అంతా ఇబ్బందుల్లో పడుతున్నది. ప్రతి శాఖ నుంచి ఖాళీల వివరాలను సేకరించి, వార్షిక కాల పట్టిక ప్రకారం జాబ్ క్యాలండర్ ప్రకటించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగులు అంటుంటే.. అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రచారం చేయడం సిగ్గుచేటు.
– చెలిమెల భానుప్రసాద్, బీఆర్ఎస్ యువజన విభాగం కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు