ఎల్లారెడ్డి రూరల్, జూలై 8: వుడ్ కార్వింగ్ కోసం తీసుకువచ్చిన చెక్కముక్కలు, బైక్‌ను స్వాధీనం చేసుకోవడంతో ఓ వ్యక్తి అటవీశాఖ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఎల్లారెడ్డిలో సోమవారం చోటు చేసుకున్నది. వివరాలు ఇలా ఉన్నాయి. గాంధారి మండలం గండివేట్ గ్రామానికి చెందిన నామాల శోభన్ తన గుడిసెకు ఉన్న పాత టేకు గుంజను కట్ చేసి 3ఫీట్ల ముక్కలు రెండు, 1ఫీట్ ముక్కలు రెండు తయారు చేసి కార్వింగ్ కోసం ఎల్లారెడ్డి పట్టణంలోని సెంటర్‌కు తీసుకువచ్చాడు. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ సెక్యూరిటీ గార్డు వాటిని పట్టుకొని ఫారెస్ట్ ఆఫీసుకు తీసుకువెళ్తుండగా, అవి కొత్త టేకు చెక్కలు కావు, పాతవి అని శోభన్ చెప్పినా వినలేదు. రూ.20వేలు ఇస్తే విడిచిపెడతానని డిమాండ్ చేయగా.. అంత ఇచ్చుకోలేనని, రెండు వేలు ఇస్తానని మొరపెట్టుకున్నాడు. డీఆర్వో గులాం యజ్దానీకి సమాచారం అందించగా చెక్క ముక్కలు, బైక్‌ను తీసుకువచ్చి ఫారెస్ట్ కార్యాలయంలో ఉంచాడు. అక్కడ కూడా అవి పాత చెక్కలేనని, నా బైక్‌ను నాకు ఇవ్వండని మొరపెట్టుకున్నా అధికారులు స్పందించలేదు. విసుగుచెందిన శోభన్ సాయంత్రం 6గంటల సమయంలో అటవీశాఖ కార్యాలయం ఎదుట పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని ఆత్మాహత్యాయత్నం చేశాడు. ఈ విషయమై ఎఫ్ఆర్వో ఓంకార్‌ను వివరణ అడుగగా తాను ఇప్పుడే వచ్చానని, తనకేం తెలియదని, డీఆర్వో లేడు, వస్తాడు అంటూ దాటవేస్తూ సమాధానం ఇచ్చారు.