విద్యానగర్, డిసెంబర్ 28 : ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు అంతర్జిల్లా దొంగలను అరెస్టు చేసినట్లు ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వారి వద్ద నుంచి 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. ఈ నెల 21న రాత్రి తాడ్వాయి పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా బైక్‌పై అనుమానాస్పదంగా కనిపించిన ఫెరోజ్, సద్దాం హుస్సేన్‌ను అదుపులోకి తీసుకున్నారు. పాపిలాన్ పరికరం ద్వారా చెక్ చేయగా ఎలాంటి నేర చరిత్ర లేక పోవడంతో వారి ఆధార్, పూర్తి వివరాలను సేకరించి వదిలేశారు.
తాడ్వాయికి గ్రామానికి చెందిన వినీత్.. తన బైక్ చోరీ జరిగినట్లు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా మరోసారి అనుమానితులు ఫెరోజ్, సద్దాం హుస్సేన్‌ను ఈ నెల 27న పోలీసు స్టేషన్‌కు పిలిపించి విచారించారు. గాంధారి, రాయికోడ్, బాన్సువాడ, కాజీపేట్, నిజాంసాగర్, శంకర్పల్లి, నారాయణఖేడ్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సైబరాబాద్, వరంగల్ జిల్లాల నుంచి వాహనాలను దొంగిలించినట్లు నిందితులు ఒప్పుకున్నారు.
జహీరాబాద్ మండలం దడ్గి, సదాశివపేట్‌లో దాచిన 11 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకొని రిమాండ్ కోసం న్యాయస్థానంలో హాజరుపర్చామని ఎస్పీ వివరించారు. అంతర్జిల్లా దొంగలను పట్టుకున్న ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, సదాశివనగర్ సీఐ రామన్, తాడ్వాయి ఎస్సై ఆంజనేయులు, ఏఎస్సై సంజీవ్, శ్రీనివాస్‌గౌడ్, రాజూనాయక్, రవి, సతీశ్, సుదర్శన్‌ను అభినందించారు. త్వరలోనే రివార్డులు అందజేస్తామని తెలిపారు.