కామారెడ్డి, అక్టోబర్ 26: కామారెడ్డిలో రెండు స్కానింగ్ (సోనోగ్రఫీ) యంత్రాలను సీజ్ చేసినట్లు డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ శనివారం తెలిపారు. కారులో స్కానింగ్ మిషన్‌ను తరలిస్తుండగా, పక్కా సమాచారంతో పోలీసులు, వైద్యారోగ్యశాఖ అధికారులు అశోక్‌నగర్ రైల్వేగేట్ వద్ద పట్టుకున్నారు. డ్రైవర్‌ను విచారించగా, మరో అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ శ్రీరాంనగర్ కాలనీలోని ఓ ఇంట్లో ఉందని సమాచారమిచ్చాడు.
దీంతో అధికారులు ఆ మిషన్‌ను కూడా స్వాధీనం చేసుకుని పీసీ అండ్ పీఎన్డీటీ యాక్ట్ కింద సీజ్ చేసినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. పట్టణానికి చెందిన ఇట్టం సిద్దిరాములుకు సంబంధించిన కారులో లింగ నిర్ధారణ యంత్రం లభించిందన్నారు. అలాగే, ఓ ఇంట్లో మరో యంత్రాన్ని స్వాధీనం చేసుకుని, కోర్టులో సమర్పించినట్లు తెలిపారు. గతంలో కూడా సిద్దిరాములు కుటుంబానికి సంబంధించిన వారు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ పట్టుబడగా, తాజాగా వారి కారులోనే మిషన్ దొరకడం కలకలం రేపింది.