Manjira River | నస్రుల్లాబాద్, మే 29: స్నానం కోసం వెళ్లిన ఇద్దరు మంజీరా నదిలో నీటమునిగి మృతిచెందిన ఘటన బీర్కూర్‌లో బుధవారం చోటు చేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన న్యాంతాబాద్ పండరి(32), టిల్లు(14)తోపాటు మరో ముగ్గురు స్నానం చేసేందుకు సమీపంలోని మంజీరా నదికి వెళ్లారు. స్నానం చేసిన అనంతరం టిల్లు నది వద్ద సెల్ఫీ(ఫొటో) తీసుకుంటుండగా కాలుజారి పడ్డాడు.
దీంతో టిల్లును కాపాడేందుకు పండరి సైతం నదిలో దూకడంతో ఇద్దరూ మృతి చెందారు. మరో ముగ్గురు స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు పండరికి భార్య విజయ, ఒక కూతురు ఉన్నారు. మండల కేంద్రంలో చికెన్షాపు నడిపించుకునేవాడని తెలిపారు. టిల్లు బీర్కూర్ జడ్పీహెచ్ఎస్లో 8వ తరగతి చదువుకుంటూ చికెన్ షాపులో పనిచేసేవాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాలను బాన్సువాడ దవాఖానకు తరలించినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.