నాగిరెడ్డిపేట/రాజంపేట్,సెప్టెంబర్14: కరెంట్ రైతు కుటుంబాల్లో విషాదం నింపింది. గడ్డి కోస్తుండగా వైర్లకు తగలడంతో ఓ రైతు దుర్మరణం చెందగా, పొలానికి వెళ్తుండగా తీగలు తగిలి మరొకరు మృతి చెందాడు. రాజంపేట్ మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ముక్కిరి రాజయ్య (41) రోజులాగే శనివారం తన పొలానికి వెళ్లాడు.
బోరు చుట్టూ గడ్డి పెరగడంతో దాన్ని కోస్తుండగా, విద్యుత్ తీగలు కొడవలికి తగిలాయి. దీంతో ఒక్కసారిగా కరెంట్ షాక్కు గురై ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు.
రాత్రివేళ పొలానికి వెళ్లిన మరో రైతు విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జోడు కృష్ణ (40)కు భార్య సునీత, ఇద్దరు కుమారులు ఉన్నారు. శుక్రవారం రాత్రి భోజనం చేసిన అనంతరం పొలానికి వెళ్లి వస్తానని చెప్పి కృష్ణ ఇంటి నుంచి బయల్దేరాడు. అయితే, శనివారం ఉదయం వరకు ఇంటికి చేరుకోలేదు.
దీంతో భార్య చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు. బంధువులు పొలానికి వెళ్లి చూడగా, బోడు రాములు మోటార్ స్టార్టర్ డబ్బా వద్ద కరెంట్ తీగలకు వేలాడుతూ కనిపించాడు. పొలానికి వెళ్తుండగా, కాలు జారి తీగలపై పడడంతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మల్లారెడ్డి తెలిపారు.