Nizamabad | వినాయక నగర్, డిసెంబర్ 27: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ముఖాలకు మాస్కులు ధరించి, చేతులకు గ్లౌజులు పెట్టుకొని ఏటీఎంలు లూటీ చేశారు. శనివారం తెల్లవారుజామున కారులో వచ్చిన దుండగులు.. గ్యాస్ కట్టర్ల సహాయంతో ఏటీఎంలను కట్ చేసి అందులోని నగదు దోచుకుపోయారు.
నిజామాబాద్ టౌన్ 4 పోలీస్ స్టేషన్ పరిధిలోని పాంగ్రా బ్రాంచ్‌కు సంబంధించిన డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ ఏటీఎంలోకి ప్రవేశించిన దుండగులు గ్యాస్ కట్టర్ సహాయంతో మెషిన్ ను కట్ చేసి సుమారు రూ. 25 లక్షలు దోచుకున్నారు. అలాగే నగరంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వర్ని చౌరస్తా వద్ద గల ఎస్బీఐ ఏటీఎంలోనూ చోరీకి పాల్పడ్డారు. ముందుగా ఏటీఎం సెంటర్లో ఉన్న సీసీ కెమెరాలపై స్ప్రే చేసి రికార్డు కాకుండా జాగ్రత్త పద్ధ దుండగులు.. దాదాపు 10 లక్షల వరకు దోచుకుపోయినట్లు తెలిసింది. ఈ రెండు ఘటనా స్థలాలను కామారెడ్డి ఎస్పీ, ఇంచార్జి సీపీ ఎం.రాజేశ్ చంద్ర పరిశీలించారు. చోరీ జరిగిన తీరును పరిశీలించిన అనంతరం.. రెండు బ్యాంకుల మేనేజర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
దోపిడీ జరిగిన ఏటీఎం లోపలి, పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీని సేకరించి, విశ్లేషించాలని ఇంచార్జి సీపీ ఆదేశించారు. అలాగే క్లూస్ టీమ్, సాంకేతిక నిపుణులు, స్థానిక పోలీసు బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. ఏటీఎంల దోపిడీతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం నిఘా కట్టుదిట్టం చేశారు. జిల్లాలోకి వచ్చే, పోయే పాయింట్లలో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు.