నిజామాబాద్, డిసెంబర్ 26, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మరికొద్ది రోజుల్లోనే పసుపు పంట చేతికి రానుంది. కొత్త ఏడాదిలో సంక్రాంతి పండుగ తర్వాత మార్కెట్‌కు పసుపు రాక మొదలు కానుంది. ఈసారి భారీ ఆశలతో రైతులు ఎదురు చూస్తున్నారు. పసుపు పంటకు గిట్టుబాటు ధర దక్కాలని ఆశ పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన రెండేళ్లలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మద్దతు ధర దక్కకపోవడంతో వ్యాపారుల చేతుల్లో నిలువునా మోస పోతున్నారు. మొదట్లో భారీ ధరలను ఆశ చూపి మాయాజాలం చేస్తున్నారు.
తీరా పసుపు రాక మొదలైన తర్వాత ఇబ్బడిముబ్బడిగా పసుపు నిల్వలు పేరుకు పోయిన అనంతరం ఇష్టారాజ్యంగా ధరల్లో కోత విధిస్తున్నారు. ఇదంతా ప్రణాళిక బద్ధంగా దోపిడీ చేస్తున్నారు. ఇందుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు వత్తాసు పలుకుతుండటంతో వ్యాపారుల మోసాలకు అడ్డూ అదుపు ఉండటం లేదు. మరికొద్ది రోజుల్లోనే పసుపును మార్కెట్‌కు తీసుకు వచ్చేందుకు రైతులంతా ఏర్పాట్లలో నిమగ్నమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలని పసుపు రైతులు కోరుతున్నారు. ఏటా పసుపు కొనుగోళ్లకు ముందు వ్యాపారులు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులతో సమన్వయ సమావేశాలను జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహిస్తారు. గతేడాది ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఈసారైన కో-ఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి రైతులకు లాభం వచ్చేలా కృషి చేయాలని రైతన్నలంతా వేడుకుంటున్నారు.
ధాన్యం, పప్పులు, ఆయిల్ సీడ్స్ వం టి పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కనీస మద్ధతు ధరను ప్రకటిస్తుంది. ఇందులో పసుపు పంటను చేర్చడం లేదు. 2025-26 వానాకాలం సీజన్‌కు ప్రకటించిన 14పంటల ఎమ్మెస్పీ జాబితాలో కూడా పసుపు లేదు. పసుపు పంట జనవరి నెలలో ప్రాసెసింగ్ మొదలవుతుంది. ఇప్పుడు హార్వెస్ట్ సమీపిస్తున్న సమయంలో మార్కెట్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అన్న అనుమానాలు రైతులను తీవ్రంగా భయపెడుతున్నాయి. బహిరంగ మార్కెట్లో డిసెంబర్ 2025లో పసుపు ధర సగటున క్వింటాకు రూ.12,900 నుంచి రూ.13,300 వరకు ఉంది.
డిసెంబర్లో ధరలు ప్రాధాన్యత స్థాయిలో కనిపిస్తోంది. ధర అధికంగా ఉన్నప్పుడు కోల్డ్ స్టోరేజీలో దాచిన పసుపును తీసి బడా రైతులు, వ్యాపారులు విక్రయిస్తుంటారు. సామాన్య రైతులకు అలాంటి వెసులుబాటు ఉండదు. సైప్లె తక్కువగా డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా ధరలు రూ.16వేలు నుంచి రూ.16,800 క్వింటాకు ఉన్నాయి. తక్కువ సైప్లె కారణంగా ధరలు పెరుగుతున్నాయి. కానీ ఈ ట్రెండ్ ఎంతకాలం కొనసాగుతుందనేది అంతు చిక్కని వ్యవహారంగా ఉంటుంది. వ్యాపారుల మాయాజాలం వల్ల ఈ ధరలు కొద్ది రోజుల్లోనే అమాంతం పడి పోయే ప్రమాదం ఉంది. మార్కెట్‌కు పసుపు రాక మొదలు కాని ధరల్లో పతనం కావడం ఏటా కనిపిస్తున్నదే. ఈసారి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
నిజామాబాద్ జిల్లా పసుపు సాగుకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. దేశంలోనే ముఖ్యమైన మార్కెట్ కూడా మన వద్దే ఉంది. 2025-26 సీజన్లో(ప్రస్తుతం) 20,120 ఎకరాల్లోనే పసుపు పంట సాగుకు నోచుకున్నట్లుగా వ్యవసాయ శాఖ అంచనాలు పేర్కొన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 70వేలు నుంచి 80వేలు టన్నులు ఉత్పత్తి అంచనా ఉంది. తెలంగాణ మొత్తం 1.33లక్షల టన్నులుగా ఉన్నది. గతంలో 2024-25 సీజన్ ప్రకారం నిజామాబాద్ జిల్లాలో 22,941 ఎకరాలు సాగైంది. తెలంగాణలో మొత్తం పసుపు సాగులో నిజామాబాద్ జిల్లాలో 54.49శాతంగా ఉంది. 2023-24లో 20,650 ఎకరాలు అంటే 47.73శాతంగా ఉంది. దిగుబడి సగటు హైక్టార్కు 8100 కిలోలుగా… ఒక ఎకరానికి 3278 కిలోలుగా ఉంది.
2015-16లో తెలంగాణలో మొత్తం సాగు 42,535 హెక్టార్లు. ఉత్పత్తి 1.84లక్షల టన్నులు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలు రాష్ట్ర ఉత్పత్తిలో 90శాతం వాటా కలిగి ఉన్నాయి. దశాబ్ద కాలంలో పసుపు సాగు చేసే రైతుల సంఖ్య అమాంతం పడిపోతోంది. కేసీఆర్ హయాంలో సాగుకు ప్రోత్సహకాలు ఉండడంతో ధైర్యంగా రైతులు ముందడుగు వేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడ్డాక పసుపు రైతులకు దిక్కూ మొక్కూ లేకుండా పోయింది. పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి సన్న వడ్లకు మాత్రమే పరిమితం చేయడంపై పసుపు రైతులు మండిపడుతున్నారు. పసుపు పండించే రైతులకు బోనస్ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు.