నిజామాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టించిన భవనమే జాతీయ పసుపుబోర్డు కార్యాలయానికి దిక్కయ్యింది. రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయమే ఇప్పుడు బోర్డు ఆఫీస్ స్థాపనకు వేదికైంది. ఇప్పుడిదే అంశం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశమైంది. తెల్లారింది మొదలు రాత్రి వరకు కేసీఆర్, ఆయన కుటుంబాన్ని ఆడిపోసుకునే ఎంపీ అర్వింద్, బీజేపీ నేతలు.. అదే కేసీఆర్ హయాంలో నిర్మించిన రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని పసుపుబోర్డు కోసం ఎంచుకోవడం విస్మయానికి గురి చేస్తున్నది. పదేళ్లలో తెలంగాణను దేశంలో నంబర్‌వన్‌గా నిలిపిన కేసీఆర్‌ను ఇన్నాళ్లు తిట్టిపోసిన నేతలు.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆయన హయాంలో కట్టిన భవనంలోకి వెళ్తారని బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.
పసుపుబోర్డు ప్రారంభోత్సవానికి హోం మంత్రి అమిత్ షా వస్తుండడంతో ముద్రించిన ఆహ్వాన పత్రికల్లో ప్రొటోకాల్‌ను విస్మరించడం చర్చనీయాంశమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా ఫొటోలతో ముద్రించిన ఆహ్వాన పత్రికలో ముఖ్య అతిథిగా అమిత్ షాను పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, పసుపుబోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి పేర్లు మాత్రమే ముద్రించారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కతో పాటు రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి, ఎంపీ, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లను విస్మరించడం విమర్శలకు తావిస్తున్నది.
అమిత్ షా నేడు ప్రారంభించనున్న జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయ భవనం కేసీఆర్ హయాంలో నిర్మించిందే. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కోసం దీన్ని నిర్మించారు. అప్పట్లో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే బాజిరెడ్డి ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. గత ఎన్నికలకు ముందు వరకు అప్పటి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఈ భవనాన్ని అధికారిక నివాసంగా వాడుకున్నారు. అయితే, రూరల్ ఎమ్మెల్యేగా గెలిచాక భూపతిరెడ్డి అధికారిక భవనంలోకి రాలేదు. తన సొంత జాగాలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. ఖాళీగా ఉన్న ఈ భవనాన్ని పసుపుబోర్డుకు కేటాయించాలంటూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కోరగా, రాష్ట్ర సర్కారు అంగీకరించింది. ఇప్పుడదే భవనంలో పసుబోర్డు ఆఫీస్ ప్రారంభోత్సవం నేపథ్యంలో.. గతంలో ఎమ్మెల్సీ కవిత, బాజిరెడ్డి ప్రారంభించిన శిలాఫలకం కనిపించకుండా మూసి వేశారు.
గెలిచిన ఐదు రోజుల్లోనే పసుపుబోర్డు తెస్తానని మభ్యపెట్టి గెలిచిన ఎంపీ అర్వింద్.. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. బోర్డు స్థానంలో స్పైసెస్ బోర్డు ఎక్స్టెన్షన్ కార్యాలయాన్ని తీసుకొచ్చి, దాన్ని ప్రారంభించారు. పసుపుబోర్డు కంటే స్పైసెస్ బోర్డు నయం అంటూ అర్వింద్ అప్పట్లో చెప్పుకొచ్చాడు. పసుపుబోర్డు అడిగేవారంతా బుద్ధిహీనులంటూ తిట్టి పోశాడు. కానీ, దాని వల్ల జిల్లా రైతాంగానికి ఒరిగిందేమిటో ఎవరికీ తెలియదు. ఎక్స్టెన్షన్ ఆఫీస్ పేరిట బీజేపీ నేతలు తొలి ఐదేళ్లు కాలం గడిపారు. మొన్నటి ఎన్నికలకు మరోసారి పసుపుబోర్డు అంశాన్ని లేవనెత్తారు.
బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఇందూరు గడ్డ మీద ప్రకటించారు. అలా రెండోసారి అర్వింద్ గెలుపొందారు. ఎన్నికలయ్యాక ఏడాది గడిచాక గానీ బోర్డు స్థాపన జరుగలేదు. రైతుల్లో అసంతృప్తి చెలరేగుతున్న తరుణంలో హడావుడిగా గత జనవరి 14(సంక్రాంతి)న పసుపుబోర్డును కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఇప్పుడదే కార్యాలయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఒక బోర్డును ఎన్నిసార్లు ప్రారంభిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. నిధులు ఇవ్వకుండా, వసతులు కల్పించకుండా అద్దె భవనాల్లో ఎన్నిసార్లు ప్రారంభోత్సవాలు చేస్తారని నిలదీస్తున్నారు.
పసుపుబోర్డు రాజకీయం కోసమే అన్నట్లు అనిపిస్తున్నది. బోర్డు కావాలని ఏండ్లనుంచి ఇక్కడి రైతులు మొరపెట్టుకుంటున్నారు. అర్వింద్ పసుపుబోర్డు ఆశ చూపి ఎంపీగా గెలిచి ఐదేండ్లు దా న్ని తేలేకపోయిండ్రు. ఇప్పుడు తెచ్చినా.. దాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నట్లే కనిపిస్తున్నది. పసుపుబోర్డు కోసం ప్రత్యేకంగా నిధులు, స్థలాన్ని కేటాయించి, మార్కెట్‌కు సంబంధించి రైతులకు పూర్తిస్థాయిలో మద్దతు ధర దక్కేలా చూడాలి. అప్పుడే రైతులకు పసుపుబోర్డు ఏర్పాటు ఫలితాలు దక్కుతాయి.
-ముత్యాల లక్ష్మణ్, రైతు, దోన్పాల్
మోర్తాడ్, జూన్ 28: పసుపుబోర్డు తేకుంటే రాజీనామా చేస్తానని అగ్రిమెంట్ రాసిచ్చి ఐదేండ్లు గడిపిండ్రు. ఇప్పుడు పసుపుబోర్డు మంజూరు కావడం సంతోషమే కానీ రైతులకు ప్రయోజనం జరిగేలా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలే. జిల్లాలో పసుపు కొనుగోలు చేసేందుకు దళారులు సిండికేట్ అవుతూ రైతులకు నష్టం చేస్తున్నరు. బోర్డు ఏర్పాటుతో పసుపు రైతుల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారమైతే ఇంకా సంతోషం.
– సంత రాజేశ్వర్, రైతు, కమ్మర్పల్లి