రెంజల్, ఆగస్టు 19 : నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కందకుర్తి వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. తెలంగాణ-మహారాష్ట్ర ఇరు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మహారాష్ట్రలోని విష్ణుపురి, గైక్వాడ్, ఇతర ప్రాజెక్ట్ ల గేట్లు ఎత్తి వేయటంతో దిగువన గోదావరి నదిలోకి భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతుంది. నది పరీవాహక ప్రాంతం ప్రమాదపు అంచున చేరుకోవటంతో సోయా సాగు చేసుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన కందకుర్తి గోదావరి నదిపై నిర్మించిన హై లెవెల్ వంతెన పైనుంచి మంజీరా,హరిద్ర, గోదావరి నదుల వరద నీటి ప్రవాహం ఉగ్రరూపం దాల్చుతుంది. గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో ధర్మాబాద్ వెళ్లే రోడ్డు మార్గాన్ని రెంజల్ పోలీసులు నిలిపివేశారు. రాకపోకలు సాగించకుండా రోడ్డుకు అడ్డంగా బారికేడ్లను ఏర్పాటుచేశారు. బోధన్, ధర్మాబాద్ నడిచే బస్ సర్వీసులను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. గోదావరి నది ఒడ్డున గల సీతారాం సంత్ సేవా ఆశ్రమం వరద నీటిలో చిక్కుకుంది.