కామారెడ్డి,జనవరి 21: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్లో ఉన్న రాజీవ్ పార్క్ పక్కనున్న 33/11 సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్ఫార్మర్ మంగళవా రం సాయంత్రం ఒక్కసారి గా పేలిపోయింది. భారీ శబ్ధంతో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికులు ఫైర్‌స్టేషన్‌కు సమాచారమివ్వడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు.
సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. షార్ట్‌సర్క్యూట్ వల్లే పేలుడు జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మంటలతో పాటు దట్టమైన పొగ ఆవరించడంతో సబ్ స్టేషన్ నుంచి ఆర కిలోమీటర్ వరకూ పోలీసులు ఎవరినీ రానివ్వలేదు.
సబ్‌స్టేషన్ పక్కనే రైస్‌మిల్ ఉండడంతో అటువైపు మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది నియంత్రించారు. ట్రాన్స్ఫార్మర్ పేలుడుతో రూ.70 లక్షల వరకు ఆస్తినష్టం జరిగిందని ఎస్ఈ శ్రవణ్‌కుమార్ తెలిపారు. విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, రెండు, మూడు రోజుల్లో మరమ్మతులు పూర్తి చేయిస్తామని చెప్పారు.