వినాయక్‌నగర్, ఏప్రిల్ 26 : నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో కిందిస్థాయి సిబ్బంది బదిలీలు భారీగా జరిగాయి. పోలీస్ శాఖలోని సివిల్ సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేశారు. ఏఎస్సై, హెడ్‌కానిస్టేబుల్స్, కానిస్టేబుళ్లకు స్థాన చలనం కల్పిస్తూ సీపీ సాయిచైతన్య ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని వివిధ పీఎస్‌లల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది బదిలీ జాబితాలో ఉన్నారు.
స్థానచలనం జరిగిన వారిలో 18 మంది ఏఎస్సైలు, 66 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 112 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. బదిలీ అయిన మొత్తం 196 మంది సిబ్బందిలో మహిళా సిబ్బంది సైతం ఉన్నారు. బదిలీ ఉత్తర్వు కాపీలను సంబంధిత ఏసీపీలు, సీఐలు, ఎస్‌హెచ్‌వోలకు కమిషనరేట్ కార్యాలయం నుంచి పంపించారు. బదిలీ జాబితాలోని సిబ్బందిని వెంటనే ప్రస్తుతం పనిచేస్తున్న పోలీసు స్టేషన్ల నుంచి రిలీవ్ చేయాల్సిందిగా సంబంధిత స్టేషన్ అధికారులను సీపీ ఆదేశించారు. ట్రాన్స్ఫర్ అయిన సిబ్బంది జాప్యం చేయకుండా తమకు పోస్టింగ్ కల్పించిన పీఎస్‌లో రిపోర్ట్ చేయాల్సిందిగా సీపీ ఉత్తర్వుల్లో వెల్లడించారు.