బోధన్, సెప్టెంబర్ 17: బోధన్ పట్టణంలో రోజురోజుకూ ట్రాఫిక్ కష్టాలు తీవ్రతరం అవుతున్నాయి. ప్రయాణికుల కోసం రైళ్లను నడపడంలో అలసత్వం చూపించే రైల్వేశాఖ.. ఈ ప్రాంత ప్రజలను ట్రాఫిక్ ఇబ్బందులకు గురిచేయడంలో మాత్రం ప్రతాపాన్ని చూపిస్తున్నది. పట్టణంలోని రైల్వే గేట్ వద్ద ప్రతిరోజూ ట్రాఫిక్ సమస్యను వాహనదారులు ఎదుర్కొంటున్నారు. ఈ రైల్వే క్రాసింగ్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం చోటుచేసుకోవడంతో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్యతీవ్రంగా మారుతున్నది.
రాయలసీమ ఎక్స్‌ప్రెస్ బోధన్‌కు ప్రయాణికుల కోసం కాకుండా కేవలం క్లీనింగ్ కోసం వస్తున్నది. నిజామాబాద్, హైదరాబాద్, తిరుపతి వెళ్లే ప్రయాణికులకు బోధన్ రైల్వే స్టేషన్లో ఎక్కేందుకు అనుమతి లేదు. అదే రైలులో ఎక్కేందుకు నిజామాబాద్ వరకు ఏదో ఒక వాహనంలో వెళ్లక తప్పని పరిస్థితి. విచిత్రమేమిటంటే.. అదే రైలులో ప్రయాణం చేసేందుకు నిజామాబాద్ వెళ్లే కొందరు ప్రయాణికులకు రాయలసీమ ఎక్స్‌ప్రెస్ వచ్చి పోయే వేళల్లో పడే రైల్వే గేట్‌తో ఇబ్బందులు కలిగిన సందర్భాలు కోకొల్లలు.
ఒకవేళ ప్యాసింజర్ రైళ్లు ఇక్కడి జనానికి అక్కరకు వస్తున్నాయా అనుకుంటే.. కాచిగూడ, కరీంనగర్ రైళ్లు తెల్లవారుజామునే ఇక్కడి నుంచి వెళ్లిపోతాయి. తిరిగి అర్ధరాత్రి వేళల్లోనే అవి బోధన్‌కు వస్తుంటాయి. ఇలా.. ఈ రెండు ప్యాసింజర్ రైళ్లతో ప్రయాణికులకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది.
ఆదాయం కోసం బోధన్‌కు రైల్వేశాఖ పెద్ద ఎత్తున గూ డ్స్ రైళ్లను నడుపుతుంటుంది. ఈ గూడ్స్ రైళ్లతో గంట వ్యవధిలోనే వచ్చిపోయే రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌తో పట్టణంలోని రైల్వే క్రాసింగ్ వద్ద గేట్లు వేస్తారు. పైగా ఈ రైల్వే క్రాసింగ్ బోధన్ పట్టణాన్ని రెండుగా చీల్చుతున్నది. ఇటు బోధన్ పట్టణం, అటు బోధన్‌లో భాగంగా ఉన్న రాకాసిపేట్ ఉంటాయి. ఈ రెండింటి మధ్య రాకపోకలు బోధన్ – బాన్సువాడ ప్రధాన రహదారిపై ఉన్న ఈ రైల్వే క్రాసింగ్ మీదుగానే కొనసాగుతాయి.
బోధన్‌లో ప్రస్తుతం ఉన్న రెండు రైల్వే స్టేషన్లలో ఒకటైన గాంధీ పార్కు రైల్వే స్టేషన్ ఈ రైల్వే క్రాసింగ్ పక్కనే ఉన్నది. ఈ స్టేషన్లో ప్యాసింజర్ రైళ్లు ఆగినప్పుడల్లా రైల్వే క్రాసింగ్పైనే రైలు ఇంజినో లేదా బోగీలో ఆగుతుంటాయి. దీంతో రైల్వే గేట్ వేసినప్పుడల్లా వాహనదారులు, పాదచారులు పడరాని పాట్లు పడుతున్నారు. అరగంటకు పైగా నిరీక్షించాల్సి ఉం టుందని స్థానికులు వాపోతున్నారు. గేటు తీసిన తర్వాత కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. ఈ రైల్వే క్రాసింగ్ రోడ్డు తప్ప మరో రోడ్డు లేకపోవడంతో ఇక్కడ తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఎదురవుతున్నది. ఇందుకు పరిష్కారంగా ఆర్వోబీ నిర్మించాలని పట్టణ ప్రజలు ఏండ్లుగా కోరుతున్నారు..
బోధన్ పట్టణంలోని ప్రధానమైన ఈ రైల్వే క్రాసింగ్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి గతేడాది 26న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. బోధన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీ ధర్మపురి అర్వింద్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేసినప్పటికీ నిర్మాణం పనుల్లో ఇప్పటివరకూ ఒక్క అడుగు ముందుకుపడకపోవడం గమనార్హం. ఏడాదిన్నర గడుస్తున్నప్పటికీ బీజేపీ పాలకులు ఆర్వోబీ పనుల ఊసే ఎత్తడంలేదు. ఆర్వోబీ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారన్న విషయంపై స్పష్టత లేదు.
అలాగే, బోధన్ నియోజకవర్గంలోని బోధన్ – నిజామాబాద్ రహదారిపై ఎడపల్లి వద్ద ఉన్న రైల్వే క్రాసింగ్ వద్ద, నిజామాబాద్ – బాసర ప్రధాన రహదారిపై నవీపేట్ వద్ద ఉన్న రైల్వే క్రాసింగ్‌పై ఆర్వోబీలు నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ రెండు చోట్ల ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఈ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయడం తగదని స్థానికులు అంటున్నారు. వీటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఇప్పటికే మంజూరైన బోధన్ ఆర్వోబీ నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని బోధన్ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.