నిజామాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇందూరు బిడ్డ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్‌గౌడ్‌కు ఎమ్మెల్సీ యోగం దక్కనున్నది. ఎమ్మెల్యేల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ స్థానానికి ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. మరోవైపు మాజీ మంత్రి, పీసీసీ ముఖ్య నాయకుడు షబ్బీర్ అలీకి అధిష్టానం షాక్ ఇచ్చింది. ఎమ్మెల్సీ పదవిని ఆశించిన ఆయనను కాదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు అవకాశం కల్పించింది. ఉమ్మడి జిల్లా నుంచి ఎమ్మెల్సీ రేసులో షబ్బీర్ అలీ, మహేశ్ కుమార్ గౌడ్లు తీవ్రంగా పోటీపడ్డారు. ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఏఐసీసీ స్థాయిలో పైరవీలు సైతం చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ ఏర్పడిన రెండు స్థానాలకు ఈసీ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేయడంతో అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ పార్టీకి అనివార్యమైంది. ఈ దశలోనే తొలుత అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లు ఖరారు అయినట్లుగా గాంధీభవన్ వర్గాలు చెప్పాయి. అధికారిక ప్రకటన వెలువడే సమయానికి జాబితాలో బల్మూరి వెంకట్‌తోపాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ పేరును చేర్చారు. దీంతో మహేశ్ కుమార్ గౌడ్ వర్గీయుల్లో సంతోషం వెల్లివిరియగా షబ్బీర్ అనుచరుల్లో నైరాశ్యం కమ్ముకున్నది. ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలకు పార్టీ, ప్రభుత్వంలో ఎలాంటి పదవులు కట్టబెట్టడం ఉండబోదన్న సంకేతాలను ఏఐసీసీ ఇచ్చినట్లయ్యింది.
బీసీలకు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతోపాటు నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కటంటే ఒక్క టికెట్ కేటాయించలేకపోయింది. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల పరిధిలో రిజర్వుడ్ స్థానాలు మినహాయిస్తే అగ్రకులాలకే కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసింది. సామాజిక న్యాయం పాటించకుండా ఇష్టానుసారంగా పార్టీ టికెట్లు కేటాయించడంపై అప్పట్లోనే కాంగ్రెస్ నాయకులు అధిష్టానం వైఖరిని తప్పుబట్టారు. బీసీలకు అన్యాయం చేయడం తగదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజామాబాద్ అర్బన్‌లో మైనార్టీ నేత షబ్బీర్‌ను మినహాయిస్తే బోధన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాలలో అగ్రవర్ణాలకే అసెంబ్లీ టికెట్లను కేటాయించింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడలోనూ ఇదే తీరు కనిపించింది. ఎట్టకేలకు ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల్లో గౌడ సామాజికవర్గానికి చెందిన మహేశ్ కుమార్ గౌడ్‌కు ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ ఎంపిక చేసింది. ముఖ్యమంత్రికి సన్నిహితుడనే పేరుండడంతోనే ఈ పదవి వచ్చిందని కాంగ్రెస్ వర్గీయులు గుసగుసలాడుతున్నారు.