Bheemgal | భీమ్గల్ : పరిసరాల పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని డీపీవో శ్రీనివాసరావు అన్నారు. భీమ్గల్ మండలంలోని పల్లికొండ గ్రామంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో ఆయన పాల్గొని గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. వర్షాకాలం సన్నద్ధతలో భాగంగా ప్రతీ కుటుంబం, వారి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలో పిచ్చి మొక్కలు తొలగించి మురికి కాలువలు శుభ్రం చేసి సరిపడా బ్లీచింగ్ పౌడర్ చల్లి యాంటీ లార్వా స్ప్రే చేస్తూ ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యవంతులను చేయాలన్నారు. సురక్షిత తాగునీరు అందే విధంగా గ్రామపంచాయతీలు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇంట్లోనే తడి పొడి చెత్తను వేరుచేసి గ్రామపంచాయతీ ట్రాక్టర్ కు అందించాలని అన్నారు.
రోడ్డుపై గాని మురికి కాలువల్లో గాని చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతీ ఇంటికి జల సంరక్షణ-మన సంరక్షణ అనుకొని ఇంకుడు గుంత నిర్మించుకునే విధంగా వారిని చైతన్యవంతులను చేయాలన్నారు. రాబోయే వర్షాకాలం దృష్ట్యా మొక్కలు నాటడానికి స్థలాలను గుర్తించి వాటిని నాటి, కాపాడాలని కోరారు. ప్రతీ ఇంట్లో ఐదు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ గ్రామంలో జీపీవో, బీఎల్ఓల ద్వారా ఎన్యూమరెషన్ ఫామ్స్ నింపి ఓట్లన్నీ నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్, సర్పంచ్ వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, మహిళా సంఘం సభ్యులు, రైతులు పాల్గొన్నారు.