2001 ఏప్రిల్ 27.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గులాబీ జెండా ఎత్తుకున్న రోజు. కోట్లాదిమంది ప్రజల ఆంకాక్షలకు ప్రతిరూపంగా టీఆర్ఎస్ పురుడుపోసుకున్న రోజు. రెండు దశాబ్దాల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన టీఆర్ఎస్ దేశం దృష్టిని తన వైపునకు తిప్పుకుంది. ఆ గులాబీ ప్రస్థానానికి నేటితో 21 వసంతాలు పూర్తయ్యాయి. ఉద్యమాలతో ప్రజలను ఏకంచేసి స్వరాష్ర్టాన్ని సాధించిన పార్టీ.. నేడు 22వ వడిలోకి అడుగుపెడుతున్నది. ఈ సందర్భంగా నేడు ఊరూరా పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో నేడు నిర్వహించే టీఆర్ఎస్ ప్లీనరీకి పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. హెచ్ఐసీసీ వేదికగా జరగనున్న గులాబీ పండుగకు ఉమ్మడి జిల్లా నుంచి ప్రజాప్రతినిధులు, ప్రత్యేక ఆహ్వానితులు ఇప్పటికే పయనమయ్యారు. ప్లీనరీలో అధినేత కేసీఆర్ కీలకోపన్యాసం చేయనున్నారు.
-నిజామాబాద్, ఏప్రిల్ 26, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
స్వరాష్ట్ర సాధన కోసం 21 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి 22వ వసంతంలోకి అడుగు పెడుతోంది. రెండు దశాబ్దాల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు అధిగమించిన టీఆర్ఎస్.. నేడు ఊరూరా వేడుకలు నిర్వహించనుంది. హైదరాబాద్ లో ప్లీనరీ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి జిల్లా నుంచి ముఖ్య నాయకులు ప్లీనరీకి హాజరు కానున్నారు.
ఎత్తిన జెండా దించని కేసీఆర్..
తెలంగాణ కోసం గతంలో ఎన్నో జెండాలు పుట్టుకొచ్చాయి. వ్యక్తిగత ఎజెండాతో జెండాలు ఎత్తిన వారంతా తమ ఎజెండా ముగియగానే స్వరాష్ట్ర ఏర్పాటు అంశాన్ని గాలికి వదిలేశారు. కానీ కేసీఆర్ ఎత్తిన జెండాను దించలేదు. ప్రాణాలకు తెగించి మరీ కొట్లాడి తెలంగాణను సాధించారు. 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ను స్థాపించిన కేసీఆర్.. స్వరాష్ట్ర సాధనలో ఎన్నో అవరోధాలు, అవమానాలు ఎదుర్కొన్నారు. ఆమరణ నిరాహార దీక్షకు దిగి ప్రాణ త్యాగానికి సిద్ధమయ్యారు. 2014, జూన్ 2న రాష్ట్ర ఏర్పాటుతో నాలుగు కోట్ల మంది చిరకాల వాంఛను నెరవేర్చారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు పెద్ద దిక్కుగా నిలిచారు. ఎన్నో సంక్షేమ పథకాలతో ఎనిమిదేళ్లుగా సుపరిపాలనను అందిస్తున్నారు.
ఇందూర్ సెంటిమెంట్..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మొదట్నుంచీ టీఆర్ఎస్ను అక్కున చేర్చుకుంది. 2001లో పార్టీ పురుడు పోసుకున్న తొలి నాళ్లలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలు సంచలన విజయాలను కట్టబెట్టారు. అప్పటి వరకు పాతుకుపోయిన కాంగ్రెస్, టీడీపీలను కాదని టీఆర్ఎస్ను ఆశీర్వదించారు. ప్రతి ఎన్నికలోనూ బాసటగా నిలుస్తూ ఇందూరు గడ్డ టీఆర్ఎస్కు కంచుకోటగా మారింది. తెలంగాణ ఏర్పాటు తర్వాతా ఉమ్మడి జిల్లా కేసీఆర్ వెంట నడిచింది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏకపక్షంగా గెలిపించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయాలను నమోదు చేసుకోగా స్థానిక సంస్థల పోరులోనూ ఊరూరా గులాబీ జెండాకే పీఠాలు దక్కాయి. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్ పీఠాలను టీఆర్ఎస్ సొంతం చేసుకుంది.
జలదృశ్యం నుంచి జలదృశ్యం దాకా..
సరిగ్గా 21 ఏండ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా ఏర్పాటైన పార్టీ టీఆర్ఎస్. కొద్దిమందితో పురుడు పోసుకున్న టీఆర్ఎస్.. ఇప్పుడు కోట్లాది మంది గుండెచప్పుడు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలకు ప్రతిరూపం టీఆర్ఎస్. ఎత్తిన జెండా దించకుండా అలుపెరుగని పోరాటం చేసిన కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ నేడు 22వ వసంతంలోకి అడుగు పెడుతుండటం శుభ పరిణామం. జలదృశ్యంలో పురుడు పోసుకున్న టీఆర్ఎస్.. స్వరాష్ట్రంలో అధికారం చేపట్టి బీడు భూములకు సాగు నీళ్లు అందిస్తూ మరో జలదృశ్యాన్ని ఆవిష్కరించింది. ఈ చారిత్రక సందర్భానికి కర్త, కర్మ, క్రియ కేసీఆరే.
– వేముల ప్రశాంత్‌రెడ్డి,రాష్ట్ర మంత్రి
గులాబీ ధూంధాం..
స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పాటైన టీఆర్ఎస్ 21ఏళ్లు పూర్తి చేసుకుంది. రెండు దశాబ్దాల కాలంలో అనేక అద్భుత ఘట్టాలకు సాక్షాత్కారమైన అధికార పార్టీ.. కరోనా మహమ్మారి ఉధృతి కారణంగా 2020లో ప్లీనరీ సభను నిర్వహించలేక పోయింది. కమిటీల కూర్పు సైతం వాయిదా పడగా, 2021 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సంస్థాగత నిర్మాణం పూర్తి చేసుకుంది. ప్రతి ఊరు, వాడల్లో పార్టీ జెండా ఎగురవేసే విధంగా పటిష్టవంతమైన కార్యాచరణతో గులాబీ దళపతి కార్యవర్గాలను ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో కమిటీల ఏర్పాటుతో పాటుగా అనుబంధ సంఘాలను నియమించారు. టీఆర్ఎస్లో పదవులు దక్కించుకున్న వారంతా కొంగొత్త హుషారుతో ఉన్నారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా జరిగే ప్లీనరీకి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు బయల్దేరి వెళ్లారు. మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మండల, పట్టణ పార్టీల అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్లు, మహిళా కో-ఆర్డినేటర్లు ప్రజాప్రతినిధుల సభకు హాజరు కానున్నారు.
తిరుగులేని సైన్యం..
టీఆర్ఎస్ ఆవిర్భవించిన సమయంలో జై తెలంగాణ అంటూ నినదించాలంటే చాలా మంది వెనుకాముందు ఆలోచించే పరిస్థితి ఉండేది. ఆనాటి పాలకులు తెలంగాణలో ఉద్యమాలను అంతగా తొక్కేసే వారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన వాళ్లపై కక్షకట్టి కటకటాల వెనక్కి పంపించారు. సమైక్య పాలకులకు ఎదురొడ్డి జై తెలంగాణ నినాదంతో బయలుదేరిన కేసీఆర్‌కు మొదట్లో పిడికెడు మంది మాత్రమే తోడుగా నిలిచారు. ఉద్యమ భావజాలం వ్యాప్తి చెందడంతో మేధావులు, యువత, మహిళలు సహా అన్ని వర్గాల వారు ‘జై కేసీఆర్’ అంటూ మద్దతు పలికారు. అలా వందల మందితో మొదలైన టీఆర్ఎస్ ప్రస్థానం ఇప్పుడు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో లక్షలకు చేరింది. టీఆర్ఎస్ పార్టీ గతంలో నిర్వహించిన సభ్యత్వ నమోదులో ఏకంగా ఐదు లక్షల మంది సైన్యం పోగవ్వడమంటే సాధారణ విషయం కాదు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సభ్యత్వం స్వీకరించారు. ఏ రాజకీయ పార్టీలకు లేనంత కార్యకర్తల బలం ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్కు మాత్రమే ఉండటం విశేషం.
తెలంగాణ జాతి పిత కేసీఆర్..
నాలుగు కోట్ల ప్రజల చిరకాల వాంఛగా మిగిలిపోయిన తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్. సమైక్య పాలకుల నుంచి విముక్తి కల్పించిన కేసీఆర్ ముమ్మాటికీ తెలంగాణ జాతిపిత. ఉమ్మడి రాష్ట్రంలో అడుగడుగునా తెలంగాణ గడ్డకు జరిగిన వివక్ష, అన్యాయాలపై గొంతెత్తి ప్రజలను చైతన్యపర్చిన కేసీఆర్.. కేవలం రాష్ట్ర సాధన కోసం పార్టీని స్థాపించి అనుకున్న గమ్యాన్ని చేరుకున్నారు. దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ అప్పుడూ, ఇప్పుడూ సంచలనం. నాడు ఉద్యమాలతో ప్రధాన ఆకర్షణగా నిలవగా, నేడు అద్భతమైన పాలనతో దేశం దృష్టిని ఆకర్షిస్తోంది.
– ఆశన్నగారి జీవన్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు