నిజామాబాద్ లీగల్, ఫిబ్రవరి 25: భారత రాజ్యాంగం నిర్దేశించిన సమన్యాయం, ఉచిత న్యాయ సేవలు, న్యాయ విజ్ఞానం బడుగులు, బలహీనవర్గాలు, దళిత, ఆదివాసీ, గిరిజన మహిళలకు అందించాలనే లక్ష్యంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా న్యాయపరిధిలోని న్యాయమూర్తులు శనివారం పల్లెబాట పట్టనున్నారు. 23 గ్రామాల్లో న్యాయవిజ్ఞాన సదస్సులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల, అదనపు జిల్లా జడ్జిలు గౌతంప్రసాద్, రమేశ్‌బాబు, షౌకత్ జహన్ సిద్ధిఖీ, పంచాక్షరి, సూర్యచంద్రకళ, సీనియర్ సివిల్ జడ్జిలు కిరణ్మహి, శివరాంప్రసాద్, వి.శ్రీనివాస్, జూనియర్ సివిల్ జడ్జిలు కళార్చన, సౌందర్య, కుశనపల్లి అజయ్‌కుమార్ జాదవ్, భవ్యకోవి, గిరిజన తిరందాసు, గౌస్ పాషా, అపర్ణ మల్లాది, ఆర్.షాలినీ, దీప్తి వేముల, స్వాతి మురారి, వెంకటేశ్ దుర్వ, జి.హారిక, కె.సుధాకర్, రామ్మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, సంబంధిత పోలీస్స్టేషన్ల హౌస్ అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలను సమన్వయం చేసుకుని న్యాయవిజ్ఞాన సదస్సుల ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయనున్నారు. చట్టాల ప్రాముఖ్యత, ప్రయోజనాలు, వాటి ద్వారా సమకూరుతున్న సంక్షేమ పథకాలను న్యాయమూర్తులు వివరించనున్నారు. మార్చి 12న నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్‌లో సివిల్ దావాలు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులను పరిష్కరించుకునేలా న్యాయార్థులను చైతన్యవంతులను చేసి ప్రోత్సహించనున్నారు.
పల్లెల్లో వివాదాలు, కక్షలులేని జన జీవితమే అందరి అభిమతం కావాలనే న్యాయ సేవా సంస్థ ధ్యేయాలను తెలియజేయనున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్లు, కామారెడ్డి జిల్లాలోని డివిజనల్ పోలీసు అధికారులు సదస్సుల విజయవంతానికి కృషి చేస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పోలీసు శాఖ, అధికార యంత్రాంగం, న్యాయసేవా సంస్థతో కలిసి విజ్ఞాన సదస్సులు, జాతీయ లోక్‌అదాలత్ ప్రజల ముంగిటికి చేరేలా కృషి చేస్తున్నాయి. ఇది జిల్లా న్యాయ వ్యవస్థలో మరో చారిత్రాత్మక సందర్భం కానున్నదని న్యాయవాద వర్గాలు భావిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయమూర్తులు, ఆర్మూర్, బోధన్ బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి కోర్టుల్లోని న్యాయమూర్తులు, ఆయా గ్రామాలకు ఉదయం తొమ్మిది గంటల వరకు చేరుకుని సదస్సుల్లో పాల్గొంటారు. న్యాయ విజ్ఞాన సదస్సులకు సమన్వయ కర్తగా న్యాయసేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జగన్నాథం విక్రమ్ వ్యవహరిస్తున్నారు. శనివారం సిర్నాపల్లి గ్రామంలో నిర్వహించనున్న న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్యఅతిథిగా ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల పాల్గొని ప్రసంగించనున్నారు.