అక్కాతమ్ముళ్ల, అన్నాచెల్లెళ్ల ఆత్మీయ పండుగ రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని ఉమ్మడి జిల్లా ప్రజలు సోమవారం జరుపుకోనున్నారు. జంధ్యాల పౌర్ణమి, శ్రావణపౌర్ణమి పేర్లతో జరుపుకొనే రాఖీ పౌర్ణమి పర్వదినానికి విశేష ప్రాముఖ్యత ఉన్నది. వేదపఠనం అభ్యసించే విద్యార్థులు నేటి నుంచే విద్యాభ్యాసాన్ని ఆరంభిస్తారు.
శివకేశవులకు ప్రీతికరమైన శ్రావణమాసంలో శ్రవణా నక్షత్రం అత్యంత శుభ, లాభాలు కలిగించే నక్షత్రం సోమవారంతో కలిసి రావడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. నేను నీకు రక్ష… నీవు నాకు రక్ష… మనమిద్దరమూ కలిసి దేశానికి రక్ష… అన్న సూక్తిని రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీలు కట్టుకొని చెప్పుకోవడం మన సంప్రదాయం. జంధ్యాల పౌర్ణమి పురస్కరించుకొని వేద ధ్యానం, వేద పఠనం కోసం పండితులు నూతన యజ్ఞోపవితాలను ధరించడం ఆనవాయితీ. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని ప్రధాన పట్టణాల్లోని చౌరస్తాల వద్ద రాఖీ విక్రయ కేంద్రాలు వెలిశాయి.