అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక గణేశ్ నవరాత్రోత్సవాలకు సర్వం సిద్ధమైంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ఉమ్మడి జిల్లా ముస్తాబైంది. ఊరూవాడా కొలువుదీరనున్న బొజ్జ గణపయ్య.. భారీ సెట్టింగులతో కనువిందు చేసే మండపాలు.. దైవత్వం నిండిన వినాయక చవితి అంటేనే అదో సంబురం. భక్తిశ్రద్ధలతో సాగే నవరాత్రోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వినాయక విగ్రహాల తరలింపు, పూజాసామగ్రి కొనుగోళ్లతో ఒకరోజు ముందే పండుగ సందడి నెలకొంది.
-కామారెడ్డి/సుభాష్‌నగర్, సెప్టెంబర్ 6
వినాయక చవితి సందర్భంగా మార్కెట్లు శుక్రవారం కళకళలాడాయి. వినాయక విగ్రహాలు, పూలు, పండ్లు, పూజాసామగ్రి తదితర వస్తువుల కొనుగోళ్లతో సందడి నెలకొంది. పూజకోసం వినియోగించే 21 రకాల పత్రి, చామంతి, బంతిపూలు, మామిడిఆకులు, మారేడికాయల అమ్మకాలు జోరుగా సాగాయి.
వినాయక చవితి అంటేనే అందరిలో అదో ఉత్సాహం. ఊరూవాడ కనిపించే సరికొత్త సంబురం. ఆకర్షణీయమైన మండపాలు.. అందులో కొలువుదీరే భారీ విగ్రహాలు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు పూజలు, భజనలతో తొమ్మిది రోజుల పాటు సందడి కనిపిస్తుంది. శనివారం కొలువుదీరనున్న వినాయకుడి కోసం ఇప్పటికే మండపాలు ముస్తాబయ్యాయి. పట్టణాల్లోనే కాదు పల్లెల్లోనూ భారీ సెట్టింగులు కనిపిస్తున్నాయి.
నేడు (శనివారం) వినాయక చవితి సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని వేలాది మండపాల్లో ఏకదంతుడిని ప్రతిష్ఠించనున్నారు. పార్వతీతనయుడి రాక కోసం ఒక్క కామారెడ్డి జిల్లాలోనే 3 వేలకు పైగా మండపాలు సిద్ధమయ్యాయి. నిజామాబాద్‌లో ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. విభిన్న ఆకృతుల్లో ముస్తాబైన గణపయ్యను మండపాలకు తరలించే ప్రక్రియ రెండ్రోజుల నుంచి కొనసాగుతున్నది. శుక్రవారం కూడా ఆ సందడి కనిపించింది.
మట్టి గణపయ్యలను కొనుగోలు చేసే వారి సంఖ్య ఈసారి కూడా బాగానే పెరిగింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ)తో తయారయ్యే విగ్రహాలు పర్యావరణానికి ముప్పుగా పరిణమించిన నేపథ్యంలో ప్రజలు మట్టి గణపయ్యలకే జైకొడుతున్నారు. మరోవైపు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు సైతం ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నాయి. అయితే, భారీ సెట్టింగులతో వేసే మండపాల్లో మాత్రం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ)తో తయారుచేసిన వినాయకులను ప్రతిష్ఠించనున్నారు.