రామారెడ్డి, జూలై 14: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో కలకలం రేపి న పెద్ద పులి కోసం గాలిం పు కొనసాగుతున్నది. రెండ్రోజుల క్రితం ఆవుపై దాడి చేసిన ఈ వన్య మృగం జాడ కోసం అటవీ శాఖ గాలిస్తున్నది. మూడు ఫారెస్ట్ రేంజ్ల పరిధిలోని 30 మందికి పైగా సిబ్బంది రంగంలోకి దిగి అన్వేషిస్తున్నారు. అలాగే, ట్రాప్ కెమెరాలు, డ్రోన్లతోనూ ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు, పశువులను కాపాడుకోవడానికి పెద్దపులిని హతమార్చేందుకు విష ప్రయోగం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
రామారెడ్డి మండలం రెడ్డిపేట్ స్కూల్ తండా గ్రామ అటవీ శివారులోకి వచ్చిన పెద్దపులి ఓ ఆవుపై దాడి చేసింది. ఘటనా స్థలంలో ఆనవాళ్లు సేకరించిన అటవీ శాఖ అధికారులు అది పెద్ద పులిగా నిర్ధారించారు. ఈ క్రమంలోనే దాని జాడ కోసం రెండ్రోజులుగా గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లభించలేదు. అయితే, పులి దాడి చేసి చంపేసిన ఆవు కళేబరంపై కొందరు విష ప్రయోగం చేసినట్లు అధికారులు గుర్తించారు. పెద్దపులి బారి నుంచి తమ జీవాలను రక్షించుకోవాలన్న ఉద్దేశంతో పశువుల యజమానులు విష ప్రయోగానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
చంపేసిన ఆవు తినడానికి పెద్ద పులి మళ్లీ వస్తుందని భావించి కళేబరంపై విషం చల్లినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని మాచారెడ్డి రేంజ్ ఆఫీసుకు తరలించి విచారిస్తున్నట్లు ఎఫ్ఆర్వో దివ్య సోమవారం తెలిపారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నదని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. అయితే, విషం చల్లిన ఆవు కళేబరాన్ని పులి తిన్నది లేనిది అటవీ శాఖ అధికారులు చెప్పలేక పోతున్నారు. ఒకవేళ తింటే మృతి చెంది ఉంటుందని అనుమానిస్తున్నారు.