వినాయక్ నగర్, ఏప్రిల్ 07: నిజామాబాద్లో (Nizamabad) మూడేండ్ల చిన్నారి అపహరణకు గురైంది. నగరంలోని గాంధీ చౌక్ ప్రాంతంలో రోడ్డు పక్కన తన అమ్మమ్మ కలిసి నిస్తున్న చిన్నారిని ఓ దుండగుడు ఎత్తుకొని పోయాడు. పాపను కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్తున్న దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి.
నిజామాబాద్ నాగారం ప్రాంతానికి చెందిన శిరీష బిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నది. ఆమెకు రమ్య అనే మూడేండ్ల కూతురు ఉన్నది. ఆదివారం సాయంత్రం కూతురితోపాటు తన తల్లి పోతవ్వతో కలిసి గాంధీ చౌక్ ప్రాంతానికి వచ్చింది. శిరీష బిక్షాటన నిమిత్తం మరోవైపు వెళ్ళింది. పోతవ్వ తన మనుమరాలితో కలిసి గాంధీ చౌక్ వద్ద ఓ గద్యపై నిద్రించింది. చిన్నారిని గమనించిన దుండగుడు రమ్యను ఎత్తుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. బిక్షాటన అనంతరం అక్కడికి వచ్చిన శిరీష తన కూతురు కనిపించకపోవడంతో తల్లి పోతవ్వతో కలిసి చుట్టుపక్కల గాలించింది. బాలిక అచూకీ తెలియకపోవడంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దుండగుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు.