లింగంపేట(తాడ్వాయి), జూన్ 24: తాడ్వాయి మండలం దేమే కలాన్‌లో మరో ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. రెండురోజుల క్రితం గ్రామంలో 24 గంటల వ్యవధిలో డయేరియాతో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం రాత్రి గ్రామానికి చెందిన నాన్మీన్ (9), మాచారెడ్డి సావిత్రి (65), గైని సత్యరాములు (45) వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో వారిని వెంటనే కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరం కొనసాగిస్తున్నారు.
కామారెడ్డి డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ గ్రామంలోని పరిస్థితిని సమీక్షించి, వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. 108 అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచారు. గ్రామస్తులు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కాచి చల్లార్చిన నీటిని తాగాలని అవగాహన కల్పించారు.
డయోరియా బాధితులను ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ గురువారం పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. గ్రామానికి చెందిన కోనింటి చిన్న భూమయ్య (60), మెట్టు స్వామి (30) డయేరియాతో మృతి చెందిన విషయం తెలిసి ఆయన గ్రామానికి వచ్చారు. బాధిత కుటుంబాలను ఓదార్చిన ఆయన.. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.