వినాయక్ నగర్, అక్టోబర్15 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం సృష్టించింది. కుటుంబ కలహాల కారణంగా తరచూ గొడవలు పడే ఆ కుటుంబానికి చెందిన ముగ్గురు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో ఒకరు మృతి చెందగా మరో ఇరువురు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు సంబంధిత రెండవ టౌన్ పోలీసులు తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి. శివాజీ నగర్లో నివాసం ఉండే దాసరి కిషన్, నాగమణి దంపతులకు దాసరి వంశీ, దాసరి బాలకృష్ణ ఇద్దరు కుమారులు ఉన్నారు.
వీరిలో ఒక కుమారుడికి వివాహం కాగా మరో కుమారుడి వివాహం విషయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో తరచూ గొడవలు పడే వారిని తెలిసింది. ఈ క్రమంలో మంగళవారం తల్లి తండ్రితో పాటు పెద్ద కుమారుడు మధ్య గొడవ జరగగా తాను ఆత్మహత్య చేసుకుంటానని పెద్ద కుమారుడు వంశీ పురుగుల మందు తాగాడు. అక్కడే ఉన్న తండ్రి కిషన్ తో పాటు తల్లి నాగమణి సైతం కొడుకు చేతిలోంచి పురుగుల మందు డబ్బా లాక్కొని వారు కూడా పురుగుల మందు తాగేశారు. ఇంట్లో వారు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన విషయం చుట్టుపక్కల వారితో పాటు బయటి వ్యక్తులకు సైతం తెలియకుండా పోయింది.
రాత్రి సమయంలో వారి బంధువులు వచ్చి చూడగా పురుగుల మందు సేవించిన ముగ్గురు అపస్మాక స్థితిలో పడి ఉన్నారు. గమనించిన వారు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. కాగా, దాసరి కిషన్ (68) అప్పటికే మరణించగా ఆయన భార్య దాసరి నాగమణి, కుమారుడు దాసరి వంశీ పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ఆ ఇరువురి పరిస్థితి సైతం విషమంగా ఉందని సమాచారం. మృతుని చిన్న కుమారుడు దాసరి బాల కృష్ణ ఫిర్యాదు మేరకు రెండవ టౌన్ ఎస్ఐ సయ్యద్ ముజాహిద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.