రెంజల్, జూన్ 19 : దైవ దర్శనానికి కూతురుతో కలిసి వెళ్లిన భార్యాభర్తలు అదృశ్యమయ్యారు. ముగ్గురి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల వివరాల ప్రకారం.. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన మెగావత్ మోహన్ (47), భార్య మెగావత్ లక్ష్మి, కూతురు మెగావత్ శిరీష (11)తో కలిసి తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శించుకునేందుకు నిజామాబాద్ రైల్వేస్టేషన్లో ఈ నెల 14న రైలు ఎక్కారు. వారం రోజులైనా తిరిగి ఇంటికి చేరుకోలేదు. మోహన్ తీసుకెళ్లిన ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండడంతో కుటుంబీకులు ఆందోళనకు గురవుతున్నారు. మెగావత్ మోహన్ బావమరిది రవీందర్ గురువారం రెంజల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు రెంజల్ ఎస్ఐ కే చంద్రమోహన్ తెలిపారు.