నిజామాబాద్ క్రైం/బోధన్ రూరల్, ఏప్రిల్ 27 : నిజామాబాద్ నగర శివారులోని అర్సపల్లి వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బోధన్ మండలం ఊట్పల్లి గ్రామానికి చెందిన కూలీలు కలెక్టరేట్ వద్ద నిర్మిస్తున్న ఐటీ హబ్లో పని చేస్తున్నారు. నిత్యం గ్రామం నుంచి వచ్చి పనులు ముగించుకొని తిరిగి వెళ్తుంటారు. రోజు మాదిరిగానే గురువారం సైతం పనులు ముగించుకొని ఆటోలో తిరుగు ప్రయాణం అయ్యారు.
అర్సపల్లి బైపాస్ రోడ్డులో ఉన్న పెట్రోల్ బం క్ వద్ద అర్సపల్లి వైపు నుంచి ఎదురుగా వచ్చిన బొలేరో పికప్ వ్యాన్ వీరు ప్రయాణిస్తున్న ఆటోను వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆటోడ్రైవర్ ఆర్.ప్రశాంత్ (35), లేబర్లు డి.చరణ్(25), డి.శ్యామ్ (48), ఆర్. రేఖ(32) మృత్యువాత పడ్డారు. వీరితో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఆటోలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటికి తీసేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రమాదం విషయం తెలియడంతో నిజామాబాద్ ఏసీ పీ కిరణ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆరో టౌన్ ఎస్సై సాయికుమార్ కేసు న మోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఊట్పల్లిలో విషాదఛాయలు
రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు వారివి. కూలీ పనులు చేసుకుంటూ ఉన్నదాంట్లో పిల్లలను చదివిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు కలలు కంటున్నారు. కానీ మృత్యురూపంలో వచ్చిన వాహనం వారి కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. నిజామాబాద్ నగర శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఊట్పల్లికి చెందిన నలుగురు మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇండ్లకు చేరాల్సిన వారు తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుల్లో శ్యామ్, చరణ్ తండ్రీకొడుకులు కావడంతో వారి కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది.