సుమారు 800 ఎకరాల భూమి.. 50 ఏండ్లుగా నూతన వంగడాలను ఉత్పత్తి చేసిన నాగిరెడ్డిపేట్లోని మాల్తుమ్మెద విత్తన క్షేత్రం.. ఈ సారి విత్తు లేక వెలవెలబోతున్నది. గత నెల మొదటివారం వరకు 70 ఎకరాల్లో పంటలు సాగుచేస్తామని హడావుడిగా ప్రతిపాదనలు పంపినా..
అధికారులు లేకపోవడం, అనుమతులు రాకపోవడంతో సాగునీరు అందుబాటులో ఉన్నా పంటలు పండించలేని పరిస్థితి నెలకొన్నది. ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే క్షేత్రం భూములు కనుమరుగయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాగిరెడ్డిపేట, సెప్టెంబర్ 15 : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద విత్తనక్షేత్రంలో ఈ సారి వర్షాకాలం పంటల సాగు చేపట్టడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విత్తననోత్పత్తిలో అగ్రగామిగా నిలిచిన విత్తనాక్షేత్రం.. నేడు విత్తు వేయని స్థితికి చేరుకున్నది. క్షేత్రంలో 834, 835 సర్వేనంబర్లలో 802 ఎకరాల విస్తీర్ణంలో భూములు ఉన్నాయి. 835 సర్వేనంబర్‌లో భూములు సాగుకు అనుకూలంగా ఉండడంతో.. 50 ఏండ్లుగా వివిధ రకాల పంటలను సాగుచేస్తూ నూతన వంగడాలను ఉత్పత్తి చేస్తున్నారు.
సరైన నీటి సౌకర్యాలు లేక పూర్తిగా పోచారం ప్రాజెక్టు ప్రధానకాలువపై ఆధారపడి పంటలను సాగు చేస్తున్నారు. ఆగస్టు మొదటివారంవరకు ప్రాజెక్టు నిండితే 70 ఎకరాల్లో పంటలను సాగు చేసేందుకు ఏర్పాట్లు చేసుకొని, ప్రతిపాదనలు పంపారు. ఆగస్టు 15 వరకు ప్రాజెక్టు నిండి ప్రధానకాలువ ద్వారా నీరు వదిలినా క్షేత్రంలో పంటలను సాగు చేయలేదు. పంటల సాగు కోసం గత నెలలో హడావుడి చేసిన అధికారులు.. ఇప్పుడు అనుమతులు లేవంటూ మిన్నకుండిపోయారు.
ఇదిలా ఉండగా ఇక్కడ పనిచేసిన ఏడీఏ వీరాస్వామి పోస్టు ఖాళీగా ఉన్నది. క్షేత్రం ఏవో హరివెంకటప్రసాద్ను నాగిరెడ్డిపేట ఏవోగా బదిలీ చేయడంతో పాటు క్షేత్రం ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. క్షేత్రం ఏఈవో శ్యాంసుందర్‌కు నాగిరెడ్డిపేట ఏఈవో ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. మరో ఏఈవో రాణిని డిప్యుటేషన్‌పై రామారెడ్డికి పంపారు.
దీంతో క్షేత్రం ఆలనాపాలనా కరువైంది. ఒక ఏడీఏ, ఇద్దరు ఏవోలు, నలుగురు ఏఈవోలు, 15 మంది సిబ్బందితో కళకళలాడిన క్షే త్రం.. నేడు అధికారులు లేక వెలవెలబోతున్నది. నూతన వంగడాలను అందించే క్షేత్రం.. నేడు విత్తనం ఉత్పత్తి చేయలేని స్థితికి చేరుకున్నది. నిర్వహణ ఇలాగే ఉంటే.. క్షేత్రానికి సంబంధించిన భూములు కనుమరుగవుతాయని మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.