నిజాంసాగర్, నవంబర్ 18: మూడు నెలలపాటు నిజాంసాగర్ నుంచి నీటి విడుదల కొనసాగడంతో ప్రాజెక్టు పరిధిలో ఉన్న మంజీరా పరీవాహక ప్రాంతంలో ఈ యేడు పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేశాయి. ఇది ఇసుక అక్రమదందా చేసే వారికి వరంగా మారింది. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అనుమతి తీసుకుంటూ ఇసుకను పక్కదారి పట్టిస్తున్నారు. అందరూ పడుకున్న అనంతరం, నిశా రాత్రి వేళలో ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. నిజాంసాగర్ మండలానికి పక్కనే ఉన్న సంగారెడ్డి జిల్లాలోని మాసన్పల్లి గ్రామ శివారులో ఉన్న దాబాల వద్ద ఇసుకను డంప్‌చేస్తున్నారు. అక్కడి నుంచి రాత్రి సమయంలో ఇసుకను లారీల్లో నింపుతూ సంగారెడ్డి, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలించి, పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. దీంతోపాటు మంజీరా పరిసరాల్లో ఉన్న బ్రాహ్మణపల్లి, మర్పల్లి అటవీ ప్రాంతాల్లో కూడా ఇసుకను రాత్రి సమయంలో పెద్దపెద్ద కుప్పలుగా డంప్ చేస్తున్నారు. అనుమతి లేకుండా మంజీరా నుంచి ఇసుకను రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లను ఈనెల 17వ తేదీన పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు. అయినా అక్రమార్కులు మాత్రం ఇసుక దందాను ఆపడం లేదు. మంజీరాలోని ఇసుక మేటలను తోడేస్తున్నారు.
అధికారుల కండ్ల ముందే అక్రమ రవాణా..
ఇందిరమ్మ ఇండ్లకు మంజీరా నుంచి ఇసుకను తీసుకెళ్లేందుకు మంగళవారం ఉదయం ఒక్కో ట్రాక్టర్‌కు రెండు ట్రిప్పుల చొప్పున అనుమతులు ఇచ్చారు. దీంతో కొంత మంది ట్రాక్టర్ వాళ్లు రెండుకు బదులు మూడు, నాలుగు ట్రిప్పులను తీసుకెళ్లడంతో ఆర్ఐ సాయిలు, గ్రామ పరిపాలన అధికారి సంగమేశ్వర్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు ట్రిప్పుల అనుమతి పొంది, అదనంగా ఎందుకు తీసుకెళ్తున్నారంటూ ట్రాక్టర్ల డ్రైవర్లకు ప్రశ్నించారు. ఒక ట్రాక్టర్ నంబర్‌తో అనుమతి పొంది, మరో ట్రాక్టర్ ద్వారా తరలిస్తుండగా.. వాటిని అడ్డుకున్నారు. తమ ఉద్యోగాలు కాపాడాలని, ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని వారు ట్రాక్టర్ల డ్రైవర్లకు సూచించారు. మంజీరా నుంచి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.