ఎల్లారెడ్డి మండలం భిక్నూర్లో నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. అర్హులకు కాకుండా కాంగ్రెస్ పార్టీ అనుయాయుల పేర్లను చదవడంతో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. దీంతో ఆర్డీవో మన్నె ప్రభాకర్ కల్పించుకొని సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. లింగంపేట గ్రామసభలో రేషన్ కార్డులపై గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. లింగంపేట మేజర్ పంచాయతీకి కేవలం 79 రేషన్ కార్డులు మంజూరుచేయడంపై నిరసన వ్యక్తంచేశారు. గతంలోనే దరఖాస్తు చేసుకున్నా తమకు ఎందు కు రాలేదని మహిళలు అధికారులను నిలదీశారు.
ఇందిరమ్మ ఇండ్లు కూడా అర్హులకు రాలేదన్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవించే తాము పను లు వదులుకొని దరఖాస్తు చేసుకుంటూ కార్యాలయాల చుట్టూ తిరగాలా అని ప్రశ్నించారు. గ్రామస్తులకు సమాధానాలు చెప్పేవారే కరువయ్యారు. ఎల్లారెడ్డి ఏడీఏ ప్రయత్నించగా, గ్రామస్తులు అధికారులను చుట్టుముట్టడంతో ఏడీఏ మాట్లాడకుండానే సభ నుంచి వెళ్లిపోయారు.
గంటకు పైగా గందరగోళ వాతావరణం ఏర్పడడంతో అధికారులు గ్రామసభను అర్థాంతరంగా ముగించి వెళ్లిపోయారు. అర్హులకు మద్దతుగా మాజీ ఎంపీపీ ముదాం సాయిలు అధికారులను ప్రశ్నించగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జోక్యం చేసుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటల యు ద్ధం సాగింది. మండల కేంద్రానికి చెందిన ఒడ్డె సావిత్రికి ఇందిరమ్మ గృహం మంజూరు కాలేదని గ్రామసభలో రోదించింది.
బీబీపేట మండలంఇస్సానగర్, మాందాపూర్, యాడారం గ్రామ సభల్లో అర్హులైన వారి పేర్లు జాబితాలో రాకపోవడంతో గ్రామస్తులు అధికారులను నిలదీశారు. బాన్సువాడ మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామసభల్లో రేషన్ కార్డుల లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు రాలేవంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తంచేశారు.
సదాశివనగర్ మండలం ఉత్తూనూర్లో నిర్వహించిన గ్రామసభలో అధికారులను నిలదీశారు. ఇందిరమ్మ ఇండ్లు, రైతుభరోసా, తలం బంగారం, రుణమాఫీపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంకా ఎన్నిసార్లు దరఖాస్తులు తీసుకుంటారని మండిపడ్డారు. రామారెడ్డి మండలం రెడ్డిపేట్ గ్రామంలోనూ హామీ అమలుపై అధికారులను గ్రామస్తులు నిలదీశారు. నస్రుల్లాబాద్,బీర్కూర్ మండలాల్లోని గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభలు వాడివేడిగా కొనసాగాయి. నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండా సభలో ఇందిరమ్మ ఇండ్లపై అధికారులను నిలదీశారు. దోమకొండ మండలంలోని సంగమేశ్వర్, అంబారీపేట, ముత్యంపేట గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక జాబితాల్లో పేర్లు రాకపోవడంతో
అధికారులను గ్రామస్తులు నిలదీశారు.
బిచ్కుందలో నిర్వహించిన గ్రామసభలో రేషన్‌కార్డులపై అధికారులను నిలదీశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ప్రజా పాలనలో 2600 మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే 240 మంది పేర్లు జాబితాలో ఎలా వస్తాయని గ్రామస్తులు ప్రశ్నించడంతో అధికారులు సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలారు. అర్హులకు అన్యాయం చేశారని, ఎన్నిదరఖాస్తు చేసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోసారి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించడంతో గతంలో ఇచ్చిన వాటి గురించి చెప్పాలంటూ పట్టుబట్టారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట జరుగగా, ఎస్సై మోహన్ రెడ్డి సముదాయించారు.దీంతో గ్రామస్తులు ఇది గ్రామ సభనా..రాజకీయ నాయకుల సమావేశమా అంటూ మండిపడ్డారు.
డిచ్పల్లి మండలం ఘన్పూర్ గ్రామసభలో యుద్ధవాతారణం నెలకొన్నది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు రాలేవంటూ అధికారులపై మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంటింటికీ వచ్చి అధికారులు తమ ఖాళీ ప్లాట్ల వద్ద ఫొటోలు తీసుకుని వెళ్లారని, ఇప్పుడు ఎంపిక జాబితాలో తమ పేర్లు ఎందుకు రాలేదని మహిళలు ప్రశ్నించారు. ఇప్పటికే ఇండ్లు ఉన్న వారి పేర్లే మళ్లీ ఎంపిక జాబితాలో ఉండడంపై పేర్లు రాని పేదలు అసహనం వ్యక్తం చేశారు. ఒకదశలో గ్రామసభ వేదికపై కి దూసుకువచ్చి అధికారులతో వాగ్వాదానికి దిగారు.దీంతో సభలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
డిచ్పల్లి సీఐ మల్లేశ్, ఎస్సై సత్యం, ఏఎస్సై హమీద్ మహిళలను సముదాయించేందుకు యత్నించారు. తమ సమస్యలను అధికారులకు చెప్పుకుంటుంటే పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నవీపేట మండలంలోని పలు గ్రామాల్లో పథకాల జాబితాలోఅర్హుల పేర్లు గల్లంతవడంపై గ్రామస్తులు అధికారుల పై తీవ్ర స్థాయిలో మండి పడుతూ అడుగుగడునా నిలదీశారు. గుంట భూమిలేని ఉపాధిహామీ కూలీలకు ఇవ్వకుండా భూములు ఉన్న వారికే ఆత్మీయ భరోసా పథకంలో పేర్లు వచ్చాయని ఎంపీడీవో నాగనాథ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిలదీశారు. సొంతంగా ఇండు ఉన్నవారికి ఇందిరమ్మ ఇండ్లు ఎలా మంజూరుచేశారంటూ ప్రశ్నించారు.
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సొంతగ్రామ జలాల్పూర్లో ఏర్పాటు చేసిన గ్రామసభలో అధికారులను ప్రజలు నిలదీశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి ఉన్న వారికే మంజూరైన పేర్లు చదివారంటూ అధికారులపై ఉపాధిహామీ కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి లేని తాము ఉపాధి పనులు చేసినా కూడా తమకెందుకు మంజూరు చేయలేదని మండిపడ్డారు. అర్హులైన కూలీలందరూ ఒక్కసారిగా లేచి అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించడంతో సభలో కొద్దిసేపు గందరగోళం పరిస్థితి ఏర్పడింది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కానీ పరిస్థితి నెలకొన్నది.
ప్కాల్ గ్రామసభలో పథకాల జాబితాల్లో అర్హుల పేర్లు లేకపోవడంతో అధికారులను గ్రామస్తులు నిలదీశారు. అర్హులైన వారికి పథకాలు అందిస్తామని చెప్పి, ఆఖరికి నిరాశకు గురిచేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. జాబితాపై గ్రామస్తులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేక గ్రామసభ అర్ధాంతరంగా ముగించి జారుకున్నారు. వేల్పూర్ మండలంలోని జాన్కంపేట్ గ్రామసభలో రసాభాస చోటుచేసుకున్నది. సంక్షేమ పథకాలను అనర్హులకు కేటాయించడంపై గ్రామస్తులు ఎంపీడీవో బాలకిషన్‌ను నిలదీశారు. అధికారులు రూపొందించిన జాబితాను వెంటనే రద్దుచేసి, మళ్లీ సర్వే చేపట్టి అర్హులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అధికారులు అర్ధాంతరంగా సభను ముగించుకొని వెళ్లిపోయారు.