ఉమ్మడి జిల్లాలో ఒక్క బస్తా యూరియా కోసం రైతులు వేకువజామున 4 గంటల నుంచి పడిగాపులు కాస్తున్నారు. నిద్రాహారాలు మాని, ఉదయం తమ పిల్లలు, పశువులను వదిలేసి సొసైటీ గోదాముల వద్దకు తరలివస్తున్నారు. యూరియా కోసం దినమంతా బారులు తీరుతున్నారు. గంటల తరబడి క్యూలో నిల్చున్నా బస్తా యూరియా దొరుకుతుందన్న గ్యారెంటీ లేకపోయింది. దొరకని వారు నిరాశతో వెనుదిరుగుతున్నారు. రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఏర్పడిన యూరియా కొరత రైతులకు శాపంగా మారింది. అదనుమీద యూరియా అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం పలు మండలాల్లో యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడ్డారు.
పెద్దకొడప్గల్, సెప్టెంబర్ 12: యూరియా కోసం పెద్దకొడప్గల్ సొసైటీ వద్ద కు మండలంలోని బేగంపూర్, కాస్లాబాద్, వడ్లం, పోచారం, అంజని, బుర్గుపల్లి, కాటేపల్లి, పోచారాం తండా, అంజని తండా, టికారం తండాల నుంచి ఉదయం నాలుగు గంటలకే రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యూరియా కోసం వరుసలో పట్టాపాసు పుస్తకాలు, ఆధార్‌కార్డులు, చెప్పులు, బస్తాలు, నర్సరీలో నుంచి మొక్కలు తెచ్చి పెట్టారు. క్యూలో ఉన్న రైతులకు ఏఈవో రూప టోకెన్లు ఇవ్వగా గోదాం వద్ద బారులు తీరారు. సరిపడా యూరియా ఇవ్వాలని రైతులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. స్థానిక ఎస్సై అరుణ్ కుమార్ సముదాయించారు. సొసైటీకి వచ్చిన 222 యూ రియా బస్తాలను పోలీసు పహారా మధ్య పట్టా పాసుపుస్తకానికి ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేశారు. ఉదయం నుంచి వరుసలో నిలబడినా యూరియా అందకపోవడంతో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ నిరాశతో వెనుదిరిగారు.
తమ పిల్లలకు వంట చేసి స్కూల్‌కు పంపలేక, ఇటు పొలాలకు వెళ్లలేక సొసైటీ ఎదుట పడిగాపులు కాయాల్సి వస్తున్నదని మహిళా రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం సరిపడా యూరియా సరఫరా చేయకపోవడంతో సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని దెగ్లూర్ నుంచి రూ.550 లకు తెచ్చుకుంటున్నామని వాపోయారు. కేసీఆర్ హయాంలో యూరియా కొరత ఉండేదికాదని గుర్తుచేసుకున్నారు. ఎన్న డూ లేని విధంగా యూరియా కొరతతో కాంగ్రెస్ ప్రభుత్వం తమను ఇబ్బందులు పెడుతున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వేకువ జామున 4 గంటలకు అచ్చి లైన్లో నిలవడిన. ఉదయం పదిగంటలైనా యూరియా ఇవ్వలేదు. మా పిల్లలు, పశువులను ఇడిసివెట్టి వస్తే ఇక్కడ పాసుబుక్కు ఒక్కటే ఇస్తున్నరు. మాకు పదెకరాల భూమి ఉన్నది. మిగతా వాటికి ఎక్కడి నుంచి యూరియా తేవాలి. బయట రూ.550 నుంచి రూ.600లకు అమ్ముతున్నారు. ఇప్పుడు అది కూడా దొరుకుత లేదు.
-హీరాబాయి, రైతు, టికారం తండా, పెద్ద కొడప్గల్ మండలం
పదెకరాల్లో వరి పంట సాగు చేసున్న. నాటు వేసిన తర్వాత ఒకసారి యూరియా చల్లిన, రెండోసారి కలుపు తీసి యూరియా వేయడానికి సొసైటీ, ఫర్టిలైజర్ షాపుల చుట్టూ తిరుగుతున్నా ఒక్క బస్తా దొరుకుతలేదు. మబ్బున 4 గంటలకు వచ్చి క్యూలో నిల్చున్నా ఒక్క బస్తా కూడా దొరికే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదు.
-గొర్రె ఏక్నాథ్, రైతు, పెద్ద కొడప్గల్