Nizamabad | కంటేశ్వర్, మార్చి 26 : నిజామాబాద్ జిల్లాలో పుష్కలంగా ఇంధన నిల్వలు ఉన్నాయని పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వదంతులు నమ్మ వద్దని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎప్పటికప్పుడు కలెక్టర్ ఇలా త్రిపాఠి నేతృత్వంలో పరిస్థితిని సమీక్ష చేస్తున్నట్లుగా వివరించారు. నిజామాబాద్ జిల్లాలో ఐఓసీఎల్ బంకులు 62 ఉన్నాయని ఇందులో 3లక్షల 94వేల లీటర్ల పెట్రోల్, 4లక్షల 59వేల లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతున్నాయన్నారు.
హెచ్.పి.సి.ఎల్ ఆధీనంలో 64 పెట్రోల్ బంకుల్లో 3.54లక్షల లీటర్ల పెట్రోల్, 3.83లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు. భారత్ పెట్రోలియం ద్వారా 69 బంకుల్లో 3లక్షల లీటర్ల పెట్రోల్, 3.5లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయని తెలిపార. మరో 6 ప్రైవేటు బంకులు కలిపితే జిల్లా వ్యాప్తంగా 211 పెట్రోల్ బంకుల్లో ప్రతి రోజు సగటున 1.50లక్షల లీటర్ల పెట్రోల్ అమ్మకాలు, 2.60లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయని చెప్పారు.
కృత్రిమంగా కొరత సృష్టించే బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్వో శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ప్రతీ రోజు పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై పర్యవేక్షణ చేస్తున్నట్లుగా చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బుకింగ్ స్లాట్లు కొనసాగుతున్నాయన్నారు. డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గడిచిన కొద్ది రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 123 కేసులు నమోదు చేసినట్లుగా శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. 264 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లుగా పేర్కొన్నారు.