రుద్రూర్, ఫిబ్రవరి 17 : బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్‌లో వర్గపోరు మరింత ముదురుతున్నది. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి వర్గీయులపై తాజాగా పోలీసు కేసు నమోదు కావడం.. పార్టీలో నెలకొన్న అంతర్గత పోరుకు అద్దం పడుతున్నది. ఇటీవల మోస్రా మండలంలో జరిగిన పార్టీ సంబంధిత కార్యక్రమానికి సంబంధించిన విభేదాలే ఈ కేసు నమోదుకు ప్రధాన కారణమని ప్రచారం జరుగుతున్నది. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వర్గీయుల ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేశారని తెలిసింది. బాన్సువాడలో ఏనుగు రవీందర్‌రెడ్డి, పోచారం మధ్య చాలా కాలంగా ఆధిపత్య పోరు నడుస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో రవీందర్‌రెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం ఓడించారు. ఆ తర్వాత కొద్దికాలానికే పోచారం బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఈ నేపథ్యంలో బాన్సువాడ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది.
నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. ఈ క్రమంలో అనుచరుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇటీవల మోస్రా మండలంలో జరిగిన పార్టీ కార్యక్రమంలో రెండు వర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. పోచారం శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్నారని, దీన్ని అడ్డుకుంటామని రవీందర్‌రెడ్డి వర్గం హెచ్చరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డు పడుతున్నారని పోచారం వర్గం వారు ఫిర్యాదు చేశారని తెలిసింది. దీంతో ఏనుగు వర్గీయులు 28 మందిపై కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా, పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తున్నారని రవీందర్‌రెడ్డి వర్గీయులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.