EGS | శక్కర్ నగర్ : గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆ సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. అనంతరం సబ్ కలెక్టర్ వికాస్ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గుమ్ముల గంగాధర్ మాట్లాడుతూ ఈ పథకానికి పేరు మార్చడం సరైంది కాదని, కార్మికుల సంక్షేమం ధ్యేయంగా కొనసాగుతున్న ఈ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. 2005లో ప్రారంభించిన ఈ పథకాన్ని యధావిధిగా 90% కేంద్ర ప్రభుత్వం నిధులు 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులతో కొనసాగించాలని అన్నారు.
ఈ పథకం ద్వారా కూలీలకు న్యాయం జరిగే విధంగా రోజుకు రూ.600 కూలీ డబ్బులు అందే విధంగా చర్యలు చేపట్టాలని, పని రోజులు పెంచాలని, బోధన్ లాంటి పట్టణంలో అధిక సంఖ్యలో కూలి పనులకు వెళ్లేవారు ఉన్నారని ఈ పథకాన్ని బోధన్ పట్టణానికి కూడా వర్తింపచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుమ్ముల గంగాధర్ తో పాటు బోధన్ డివిజన్ నాయకులు పడాల శంకర్, సుల్తాన్ సాయిలు, కాశ రవి, శ్రీపతి మల్లేష్, భూపాల్, గోపాల్, కొండ్ర హనుమంతు, కె సుదర్శన్, హెచ్ నగేష్ తదితరులు పాల్గొన్నారు.