రాష్ట్రంలోని పల్లెలు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి. సమైక్య పాలనలో మురికి కూపాలుగా ఉన్న గ్రామాలు స్వరాష్ట్రంలో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. కేంద్రం ప్రకటిస్తున్న స్వచ్ఛసర్వేక్షణ్ అవార్డులే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ ఏడాది కామారెడ్డి జిల్లా హై అచీవర్స్‌లో మూడో స్థానంలో నిలిచింది. ఏడు గ్రామాలు అవార్డుల కోసం పోటీ పడుతున్నాయి. అక్టోబర్‌లో ఇందుకు సంబంధించిన ఫలితాలను ప్రకటిస్తారు.
-కామారెడ్డి, జూలై 17 (నమస్తే తెలంగాణ)
కామారెడ్డి, జూలై 17 (నమస్తే తెలంగాణ) : సమై క్య రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి ఆమడ దూరంలో ఉండిపోయింది. గుంతల రోడ్లు, అస్తవ్యస్తమైన పారిశుద్ధ్యం, డ్రైనేజీలతో పల్లెలు మురికి కూపాలను తలపించాయి. కానీ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ గ్రామీణ, పట్టణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరిట కార్యక్రమాలను చేపట్టారు. కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నది. మురికి కూపాలుగా ఉన్న పల్లెలు, పట్టణాలు ప్రస్తుతం అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. కేంద్రం ప్రకటించే స్వచ్ఛసర్వేక్షణ్ అవార్డులే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కేంద్ర పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ ర్యాంకులను ప్రకటించగా, స్వచ్ఛ సర్వేక్షణ్ హై అచీవర్స్ కేటగిరీలో కామారెడ్డి వివిధ అంశాల్లో 300/300 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభను చాటింది. మన రాష్ట్రం నుంచి ఈ సారి నాలుగు జిల్లాలు ముందువరుసలో ఉన్నాయి. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలు, అంగన్వాడీలు, రోడ్లు, బహిరంగ మార్కెట్లు,ప్రార్థనాలయాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, నీటి సరఫరా పరిస్థితులపై అంచనా వేసి, పరిమాణాత్మక, గుణాత్మక సర్వే నిర్వహించిన అనంతరం జాతీయ స్థాయిలో ప్రతి ఏడాది అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా 15 గ్రామాలను ఎంపిక చేస్తారు.
కామారెడ్డి జిల్లాలో ఏడు గ్రామాలు
దేశవ్యాప్తంగా ఎంపిక చేసే 15 గ్రామాల్లో స్థానం పొందేందుకు కామారెడ్డి జిల్లాలోని ఏడు గ్రామాలు పోటీ పడుతున్నాయి. జిల్లాలోని శివాయిపల్లి, రత్నగిరి, గర్గుల్, బస్వాపూర్, దోమకొండ, సదాశివనగర్, పిట్లం గ్రామాలు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ కేటగిరీలో పోటీలో ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క గ్రామం ఎంపికైనా జిల్లాకు అవార్డు దక్కుతుంది. ముఖ్యం గా సదాశివనగర్ గ్రామం స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ముం దువరుసలో కనిపిస్తోంది. ప్రతి ఏడాది అక్టోబర్‌లో దేశ వ్యాప్తంగా 15 గ్రామాలను ఎంపిక చేస్తా రు. ప్రస్తుతం జూన్ వరకు ఇచ్చిన మార్కుల్లో కామారెడ్డి జిల్లాకు 300 మార్కులకు గాను 300 మార్కులు రావడం గమనార్హం. కాగా గత ఏడాది 2022 అక్టోబర్‌లో ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో నిజామాబాద్ జిల్లా మూడో స్థానం సాధించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ (డీడీడబ్ల్యూఎస్)వారు మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఐఎంఐఎస్) ద్వారా దేశంలోని జిల్లాల వారీగా మూల్యాంకనం చేసిన తర్వాత ర్యాంకింగ్స్ ఇస్తారు. అక్టోబర్ 2022 నుంచి జూన్ 2023 వరకు జిల్లాలో జరిగిన పారిశుద్ధ్య ప్రగతి సహా గ్రామాల్లో సెగ్రిగేషన్ షెడ్లు, చెత్త సేకరణ, రవాణా, ట్రాక్టర్లు, ట్రాలీల వినియోగం, మురుగునీటి నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లు, గ్రామాల్లో పారిశుద్ధ్యంపై అవగాహన చిత్రాలు, వాల్ పెయింటింగ్స్, పరిసరాల పరిశుభ్రత, ఎస్బీఎం ఫేజ్-2పై నిర్వహించిన శిక్షణా కార్యక్రమా లు వంటి వివిధ అంశాల్లో 300 మార్కులకు గాను 300 సాధించి మూడో స్థానంలో జిల్లా నిలిచింది. అయితే అక్టోబర్‌లో పూర్తి ఫలితాలు వస్తాయి.
గ్రామాలను మార్చిన పల్లె ప్రగతి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఇటు గ్రామాలు, అటు పట్టణాలకు కొత్త దశను తెచ్చాయి. గ్రామాలు, పట్టణాల్లో అన్ని రకాల మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చా యి. పల్లెలన్నీ పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివిరుస్తున్నాయి. ప్రతి ఊరిలో పార్కు, గ్రామీణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు. పిల్లలు, యువత ఆరోగ్యం కోసం ఇవి ఎంతో ఉపయోగప డుతున్నాయి. ప్రతి గ్రామం స్వచ్ఛంగా ఉండాలని, నిరంతరం పారిశుద్ధ్య నిర్వహణ ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పల్లె ప్రగతిని చేపట్టారు. ప్రజల ఆహ్లాదం కోసం పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. రోజూ ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రతి ఊరికి ట్రాక్టర్లను అందుబాటులోకి తెచ్చారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని పెంచారు. ప్రతి ఇంటికి చెత్త బుట్టలు పంపిణీ చేశారు. రోజూ సేకరించే చెత్తను డంపింగ్ యార్డుకు తరలించి కంపోస్ట్‌గా మార్చేందుకు ప్రత్యేక నిర్మాణాలు చేశారు. చెత్త నిర్వహణ పకడ్బందీగా ఉండడంతో ఊర్లన్నీ శుభ్రంగా ఉంటున్నాయి. అలాగే అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలను నిర్మించింది. ఇందులో నీటి సరఫరా, మహిళలు దుస్తులు మార్చుకొనే గది, ఇతర వసతులు కల్పించారు. మొక్కలను నాటి అందంగా తీర్చిదిద్దారు. ప్రతీ గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాలు ఏర్పాటు చేసి స్వచ్ఛమైన నీటి సరఫరా చేస్తున్నారు. అన్ని రకాల వసతులతో పల్లెలు ప్రస్తుతం సరికొత్తగా మారాయి. దీనికి గుర్తింపుగా కేంద్ర పారిశుద్ధ్య, జలశక్తి మంత్రిత్వ శాఖ వారు మార్కులను కేటాయిస్తుంది. కామారెడ్డి జిల్లా సమగ్ర విధానంలో మంచి స్కోర్‌తో ముందున్నది.
సమష్టి కృషితో మంచి మార్కులు
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దేశంలోనే కామారెడ్డి జిల్లా మూడో స్థానంలో ఉండడం హర్షణీయం. జిల్లాలోని ఏడు గ్రామాలు ముందు వరుసలో ఉన్నాయి. పల్లె ప్రగతిలో క్షేత్ర స్థాయిలో భాగస్వాములైన అధికారులు, ప్రజాప్రతినిధులకు అభినందనలు. ఈ రెండు నెలల్లో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు జిల్లాను సందర్శిస్తారు. జిల్లాలోని 596 గ్రామాల్లో కనీసం 50 గ్రామాలను కేంద్ర బృంద సభ్యులు పరిశీలించి మార్కులు ఇస్తారు. అక్టోబర్‌లో జాతీయ స్థాయిలో 15 గ్రామాలను ఎంపిక చేస్తారు.
-సాయన్న, డీఆర్డీవో
పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధి
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలను ఎంతో అభివృద్ధి చేస్తున్నది. పల్లె ప్రగతి కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చింది. దీంతో కేంద్రం ప్రతి ఏడాది నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రంలోని గ్రామాలు ఎంపికవుతున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామపంచాయతీ సిబ్బంది మెరుగైన పాత్రను పోషించారు. అందుకే నేడు దేశంలోనే మనం ముందు వరుసలో ఉన్నాం.
– సాయాగౌడ్, జడ్పీ సీఈవో, కామారెడ్డి
గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి ద్వారా మా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ సహకారంతో అందమైన పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, ఇంటింటికీ నల్లాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, చెత్త సేకరణకు ట్రాక్టర్, డంపింగ్ యార్డు, ప్రతిఇంటి ముందు మొక్కలు నాటించాం. మా గ్రామం ఈ సారి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ అవార్డు కోసం పోటీ పడుతున్నది. అవార్డు వస్తుందని భావిస్తున్నా.
– బద్దం శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్, సదాశివనగర్