Ashannagari Jeevan Reddy | నందిపేట్ : రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తూ వ్యవసాయాన్ని కుంటుపరిచేలా ప్రభుత్వం అమలు చేస్తున్న యూరియా మొబైల్ యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో రైతులు చేపట్టిన భారీ ధర్నాలో జీవన్ రెడ్డి పాల్గొన్నారు. రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ సాంకేతికత పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్ రైతులకు ఉపయోగపడటం కన్నా ఇబ్బందులు సృష్టిస్తోందని మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలు, స్మార్ట్ఫోన్లు లేని రైతుల పరిస్థితిని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. యాప్ ద్వారా యూరియా పంపిణీ చేయడం వల్ల రైతులు ఎరువుల కోసం రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయాన్ని సులభతరం చేయాల్సిన ప్రభుత్వం తుగ్లక్ నిర్ణయాలతో రైతులపై అదనపు భారాన్ని మోపుతోందని విమర్శించారు. రైతులకు సకాలంలో ఎరువులు అందక పంటలు దెబ్బతింటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. యూరియా యాప్ కారణంగా బ్లాక్ మార్కెట్ పెరిగే ప్రమాదం ఉందని, రైతులు ప్రైవేట్ వ్యాపారుల చేతిలో దోపిడీకి గురవుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగానికి ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకున్నారని, కానీ నేడు రైతులు ఎరువుల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మునుపటిలాగే గుర్తింపు కార్డుల ఆధారంగా నేరుగా ఎరువులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో నందిపేట్ మండలంతో పాటు జిల్లా వ్యాప్తంగా సరిపడా యూరియా, ఇతర ఎరువుల నిల్వలను ప్రభుత్వం వెంటనే అందుబాటులో ఉంచాలని కోరారు. రైతులకు శాపంగా మారిన యూరియా యాప్‌ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, లేనిపక్షంలో రైతాంగంతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, నందిపేట్, డొంకేశ్వర్ మండల బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.