Urea App | బాన్సువాడ రూరల్, జూన్ 21 : యూరియా యాప్ పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని, తక్షణమే యూరియా యాప్ ను ఎత్తివేసి పాత పద్ధతిలోనే రైతులకు యూరియాను సరఫరా చేయాలని రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు దుద్దాల అంజిరెడ్డి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. బాన్సువాడ మండలంలోని సోమేశ్వర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సకాలంలో యూరియా పంపిణీ చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఎన్నికల్లో మోస పూరితమైన హమీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక రైతులను విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో రైతులకు సరిపడ యూరియా పుష్కలంగా లభించిదని అన్నారు. కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం రైతులు చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి దాపురించిందని అన్నారు. వ్యవసాయ సలహాదారుడిగా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్‌గా ఉన్న కాసుల బాల్ రాజ్ ప్రభుత్వానికి ఎం సలహాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. యాప్ వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నా ఇక్కడి నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదని అన్నారు.
రైతులకు రావాల్సిన మూడు విడతల రైతు బరోసా నిధులను ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి సర్కారు రైతులకు క్షమాపనలు చెప్పాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులను రాజుగా చేయడమే లక్ష్యంగా గత సీఎం అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఇప్పటి సీఎం రేవంత్‌రెడ్డి రైతుల నడ్డి విరిచే పథకాలను అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో నిజాంసాగర్‌లో లో నీళ్లు లేక రైతులు సాగు నీటి కోసం ఇబ్బందులు పడుతుంటే కాళేశ్వరం నీటిని నిజాంసాగర్‌లోకి తీసుకొచ్చి నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు పుష్కలంగా సాగు నీరు అందించిన ఘనత కేసీఆర్ కే దక్కిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికై ఇచ్చిన ప్రజలు, రైతులకు ఇచ్చిన హమీలు అమలు చేయాలని, యూరియా యాప్ ను ఎత్తేసి, పాత పద్దతిలోనే రైతులకు యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన ధాన్యానికి కొర్రీలు పెట్టకుండా అన్ని రకాల వరి పంటలకు బోనస్ ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నాయిని మొగులయ్య, బోడ రామచందర్, గులేపల్లి మొగులయ్య, మన్నే అనిల్, సాయిబాబా, లక్ష్మణ్, భరత్, షరీఫ్, ఎల్లయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు.