దేవుళ్లు దుఃఖిస్తారా! కష్టాల పాలవుతారా! అనే అనుమానం చాలామందికి రావొచ్చు. లోకాతీతులైన దేవుళ్లకు ఇది వర్తించనే వర్తించదు. కానీ, ఏసు ప్రభువు దుఃఖించాడు. ఆయన ఒకసారి కాదు రెండుసార్లు దుఃఖించినట్టుగా బైబిలు చెబుతున్నది. ఒకటి, లాజరు మరణ సమయంలో. అతని మరణ వార్త విని, ఏసు ప్రభువు కన్నీరు కార్చాడు. అంటే, స్నేహితుడైన లాజరు కోసం, మరియ మార్తల దుఃఖం చూచి ప్రభువు కదిలిపోయాడు. మానవత్వాన్ని చూపించిన చోటు.
ఇక రెండో సందర్భం, యెరూషలేము కొరకు విలపించినప్పుడు. అంటే, ఆ పట్టణాన్ని చూసి ప్రభువు కన్నీరు పెట్టుకున్నాడు. యెరూషలేము వారు రక్షణను అంగీకరించరని తెలిసి, వారి భవిష్యత్తు తలచి ప్రభువు ఏడ్చాడు. ఇది దేశం మీద కరుణ. లాజరు మరణం, యెరూషలేము ప్రజల పాపం, నాశనం గురించి దుఃఖంతో ప్రభువు ఆవేదన చెందాడు. ప్రభువులో రెండు స్వభావాలున్నాయి. ఒకటి దైవ స్వభావం. రెండు మానవ స్వభావం. ఆయన అద్భుతాలు చేసేటప్పుడు దైవ స్వభావం వ్యక్తమైతే, సిలువ మరణాన్ని పొందేటప్పుడు అచ్చమైన మానవ స్వభావం వ్యక్తపరిచాడు. ఇదీ దేవ రహస్యం. మానవుణ్ని సన్మార్గంలో నడపడానికి కూడా ఒక్కోసారి మానవ స్వభావిగా కనిపిస్తాడని కూడా మనం భావించుకోవాలి.